90 రోజులు… 84 మంది లంచావతారులు

  • అక్రమార్కులపై ఏసీబీ విస్తృత ప్రచారం
  • సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్
  • అధికారులు, ఉద్యోగ వర్గాల్లో విస్తృత చర్చ

‘లంచం తీసుకునే అధికారులను పట్టిద్దాం.. అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం’ అంటూ అవినీతి నిరధక శాఖ విస్తృత ప్రచారం చేస్తున్నది. దీనికి ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ‘లంచగొండుల్ని ప్రభుత్వం డిస్మిస్ చేసి, వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలి’… అంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫారాలలో జనం తీవ్రంగా స్పందిస్తున్నారు. మరోవైపు సస్పెండ్ అనే చిన్నవాటితో సరిపెట్టొద్దు… అవసరమైతే చట్టాల్లో మార్పులు చేసైనా వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతున్నది. గతంలో ఏసీబీ కేసులు అత్యంత అరుదుగా జరిగేవి. కానీ గడిచిన మూడు నెలల కాలంలో తెలంగాణలో 84 మంది అవినీతి అధికారులు, ఉద్యోగులు ఏసీబీకి పట్టు బడడం తీవ్ర చర్చనీయాంశమైంది.

మూడు నెలల్లోనే ఇంతమంది దొంగలా..?
దొరకని దొంగ దొర లెంతమందో..! అంటూ ఏసీబీ అధికారులు విడుదల చేసిన లంచావతారుల చిట్టాపై జనం ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో రేపో మాపో రిటైర్డ్ అయ్యేవాళ్ళు కూడా వున్నారు….రిటైర్డ్ ఐతే అమ్యామ్యాలకు చాన్స్ దొరకదని అధికారులు, ఉద్యోగులు ఇప్పుడే కక్కుర్తి పడుతున్నారంటూ సోషల్ మీడియాలో పలువురు మండిపడుతున్నారు. నిరుద్యోగులుగా ఉన్న వేలాది మంది ఎంటెక్, బీటెక్ లు చేసి ఉద్యోగాలు రాక, పెళ్లిళ్లు లేక నెలకు రూ. 20-30 వేల జీతాలకే పనిచేస్తున్న యువత పరిస్థితి ఏమిటి..? అంటూ ప్రశ్నిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగాలతో మంచి జీతాలు, సంఘంలో.. బంధువుల్లో గౌరవం.. ఇవి చాలక విలాసాలకి కక్కుర్తి పడి, జలగల్లా జనాల్ని పీడించి లంచాలు తీసుకుంటూ కుప్పలు తెప్పలుగా పోగేసుకుంటూ ఏసీబీకి పట్టుబడుతున్న వారిని డిస్మిస్ చేసే చట్టాలను తయారు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఏసీబీకి భలే క్రేజ్…
గతంలో ఏసీబీ కేసులు అత్యంత అరుదుగా కనిపించేవి. కానీ గడిచిన మూడు నెలల కాలంలోనే తెలంగాణలో 84 మంది అవినీతి అధికారులు, ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఏసీబీకి సమాజంలో మరింత క్రేజ్ పెరిగింది. దీనికి తోడు ఏసీబీ తన టోల్ ఫ్రీ నంబర్ ప్రకటించి పెట్టి విస్తృత ప్రచారం చేస్తున్నది. ఈ కారణంగా ప్రభుత్వ కార్యాలయాలలో పనుల కోసం వచ్చేవారిని వేధిస్తున్న ఉద్యోగులు అధికారులు ఏసీబీ అధకారులను ఆశ్రయించడం పెరుగుతున్నది.