హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఏసీబీ(ACB) సోదాలు

  • ఏడీఈ అంబేద్క‌ర్ బంధువు ఇంట్లో రూ. 2 కోట్ల న‌గ‌దు సీజ్..

విద్యుత్ శాఖలో పలువురు ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రంగంలోకి దిగారు. అందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని మణికొండలో ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న అంబేద్కర్ నివాసం, ఆయన బంధువుల నివాసాలతోపాటు ఆయన కార్యాలయంలో సైతం సోదాలు చేపట్టారు.

హైదరాబాద్ నగరంలోని మణికొండ, నార్సింగ్ డివిజన్లలో ఏడీగా అంబేద్కర్ విధులు నిర్వర్తిస్తున్నారు. 15 బృందాలుగా విడిపోయి గచ్చిబౌలి, మాదాపూర్ , హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల సోదాలు చేపట్టారు. అయితే ఈ తనిఖీల్లో భాగంగా అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు.. భారీగా వ్యవసాయ భూములు, స్థలాలతోపాటు భవనాలను అంబేద్కర్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో తనిఖీల్లో భాగంగా భారీ ఆస్తులు బయటపడుతున్నాయి. గచ్చిబౌలిలో ఖరీదైన భవనం గుర్తించినట్లుగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ వెల్ల‌డించారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో 10 ఎకరాల‌ వ్యవసాయ భూమిని అంబేద్కర్ కొనుగోలు చేశారని పేర్కొన్నారు. అక్కడే మరో వెయ్యి గజాల్లో వ్యవసాయ క్షేత్రం కూడా ఉన్నట్లుగా గుర్తించామని అన్నారు. విద్యుత్‌ శాఖ ఏడీఈ అంబేడ్కర్ ఆస్తులపై సోదాలు ముగిశాక మరిన్ని వివరాలు వెల్లడిస్తాం ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు.

అయితే ఇలా కూడబెట్టిన ఆస్తులకు తన బంధువులను బినామీలుగా సదరు అధికారి అంబేద్కర్ ఉంచినట్లు ఏసీబీ అధికారులు కనుగొన్నారు. దాంతో అంబేద్కర్ అవినీతి ఆస్తుల చిట్టాను ఏసీబీ అధికారులు లెక్కిస్తున్నారు. అలాగే అంబేద్కర్‌కు హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు 15 బృందాలుగా ఏర్పడి ఈ సోదాలు చేపట్టారు. ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

ఏడీఈ అంబేద్క‌ర్ బంధువు ఇంట్లో రూ. 2 కోట్ల న‌గ‌దు సీజ్..
విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్క‌ర్ నివాసంతో పాటు ఆయ‌న బంధువుల ఇంట్లో కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొన‌సాగుతున్నాయి. అయితే అంబేద్క‌ర్ నివాసంతో పాటు బంధువుల ఇంట్లో లెక్క‌లేనంతా డ‌బ్బు బ‌య‌ట‌ప‌డుతుంది. ఆస్తులు కూడా భారీ స్థాయిలో వెలుగు చూస్తున్నాయి. అంబేద్క‌ర్ బంధువు ఇంట్లో రూ. 2 కోట్ల న‌గ‌దు ప‌ట్టుబ‌డిన‌ట్లు ఏసీబీ అధికారులు వెల్ల‌డించారు. భారీగా బంగారం కూడా ప‌ట్టుబ‌డింది. ఈ బంగారం విలువ‌ను కూడా అధికారులు లెక్కిస్తున్నారు.రూ. 2 కోట్ల న‌గ‌దును చూసి ఏసీబీ అధికారులు విస్తుపోయారు. అన్ని రూ. 500 నోట్ల క‌ట్ట‌లే ఉన్నాయి. రూ. 200 నోట్ల క‌ట్ట‌లు ఒక‌ట్రెండు ఉన్నాయి. ఈ న‌గ‌దును లెక్క‌పెట్టేందుకు నోట్ల లెక్కింపు యంత్రాల స‌హాయం తీసుకున్నారు అధికారులు. సాయంత్రంలోగా మ‌రిన్ని ఆస్తులు బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంది.