తిరుమ‌ల‌గిరి మండ‌లంలో కొత్త‌గా 4వేల మందికి భూప‌ట్టాలు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

  • స‌ర్వేలో 3వేల మంది అన‌ర్హులు గుర్తింపు
  • మాన‌వీయ కోణంలో భూ స‌మ‌స్య‌లకు ప‌రిష్కారం చూపాలి
  • రెవెన్యూ, అట‌వీ అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి
  • రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : పేద ప్రజలు ద‌శాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో మానవీయ కోణంలో ఆలోచన చేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌కు సూచించారు. డాక్ట‌ర్ బి. ఆర్‌, అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో మంగ‌ళ‌వారంనాడు న‌ల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో భూ స‌మ‌స్య‌ల‌పై అట‌వీ శాఖ మంత్రివ‌ర్యులు శ్రీ‌మ‌తి కొండా సురేఖతో క‌లిసి మంత్రి స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి కె. జానా రెడ్డి, నాగార్జున సాగర్ శాసన సభ్యులు కె. జ‌య‌వీర్ రెడ్డి, దేవ‌ర‌కొండ శాస‌న‌స‌భ్యులు బాలూ నాయిక్‌, రెవెన్యూ శాఖ సెక్రటరీ డి ఎస్.లోకేష్ కుమార్, పిసిసిఎఫ్ డాక్ట‌ర్ సి. సువ‌ర్ణ‌, నల్గొండ కలెక్టర్ ఐలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. ఈసంద‌ర్బంగా మంత్రిగారు మాట్లాడుతూ చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌ను సాకుగా చూపించి స‌మ‌స్య‌ల‌ను జ‌ఠిలం చేయ‌వ‌ద్ద‌ని అట‌వీశాఖ అధికారుల‌కు సూచించారు. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో 40-50 సంవ‌త్స‌రాల నుంచి సాగు చేసుకుంటున్న భూముల‌పై గిరిజ‌నుల‌కు హ‌క్కులు క‌ల్పించ‌డానికి త‌మ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ఉంద‌ని అయితే వివిధ నిబంధ‌న‌లు చూపుతూ ఆ భూములు అట‌వీశాఖకు చెందిన‌వ‌ని అట‌వీ అధికారులు కొర్రీ వేస్తున్నార‌ని అన్నారు. ఈ అంశంపై రెవెన్యూ , ఫారెస్ట్ విభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్కారం చూపేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

భూభార‌తి పైల‌ట్ ప్రాజెక్ట్ లో భాగంగా నాగార్జున సాగ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోని తిరుమ‌ల గిరి ( సాగ‌ర్‌) మండ‌లాన్ని ఎంపిక చేసి ప్ర‌యోగాత్మ‌కంగా స‌ర్వే నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని ఈ పైల‌ట్ ప్రాజెక్ట్ కోసం 235 స‌ర్వే నెంబ‌ర్ల‌ను ఎంపిక చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. మొత్తం 23వేల ఎక‌రాలో స‌ర్వే నిర్వ‌హించ‌గా అందులో 12వేల ఎక‌రాలు ప్ర‌భుత్వ భూమిగా గుర్తించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. ఇందులో 8వేల ఎక‌రాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయ‌ని తెలిపారు. వీటిలో 4 వేల ఎక‌రాలు పాసుపుస్త‌కాల‌తో సాగులో ఉన్నాయ‌ని వివ‌రించారు. మిగిలిన 4037 ఎక‌రాల‌కు సంబంధించి కొత్త పాసు పుస్త‌కాలు ఇవ్వ‌వ‌ల‌సి ఉంద‌న్నారు. అంతేగాక ఈ స‌ర్వేలో 2936 ఎక‌రాల‌కు సంబంధించి 3069 మంది వ‌ద్ద బోగ‌స్ పాసు పుస్త‌కాలు ఉన్న‌ట్లు గుర్తించి వారి పాసు పుస్త‌కాల‌ను ర‌ద్దుచేశామ‌ని తెలిపారు. వీరికి రైతు భ‌రోసా, రైతు భీమా త‌దిత‌రాల‌ను ర‌ద్దు చేశామ‌న్నారు. స‌ర్వేలో భాగంగా 7వేల ఎక‌రాలు అట‌వీ భూమిని గుర్తించామ‌ని, ఈ భూముల‌కు సంబంధించిన వివాదాల‌ను వీలైనంత త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌కు సూచించారు.