లాక్ డౌన్‌ను మరో రెండు వారాలు కొనసాగించాలి – సీఎం కేసీఆర్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడిగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. పలు రాష్ర్టాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా నివారణ చర్యలు, రాష్ర్టాల్లో పరిస్థితులపై పీఎం సమీక్ష చేపట్టారు. అదేవిధంగా లాక్‌డౌన్‌ కొనసాగింపుపై సీఎంల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో భాగంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ… లాక్‌డౌన్‌ను మరో 2 వారాలు పొడిగించాలని ప్రధానిని కోరారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ బాగా ఉపయోగపడిందన్నారు. కరోనా సమర్థ నియంత్రణకు లాక్‌డౌన్‌ను కనీసం రెండు వారాలపాటు కొనసాగించడం మంచిదని అభిప్రాయపడ్డారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇంతకు మించిన మార్గం లేదన్నారు. కరోనాపై యుద్ధంలో భారత్‌ తప్పక గెలిచి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనాపై పోరాటానికి రాష్ర్టాలకు కేంద్రం నుంచి కావాల్సిన మద్దతు లభిస్తోందన్నారు. 

దేశం ఏకతాటిపై నిలబడి కరోనా వైరస్‌పై పోరాడుతుందన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. లాక్‌డౌన్‌ అమలు వ్యూహం కోసం ప్రధాని అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని పంట కొనుగోళ్లపై సీఎం వివరించారు. 6,849 కేంద్రాల్లో పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నట్లు ప్రధానికి తెలిపారు. ధాన్యం సేకరణకే రూ.25 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వ్యవసాయదారుల కోసం ఏం చేయాలి, ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్వహించాలో వ్యూహం ఖరారు చేసి అమలు చేయాలన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3 నుంచి 5 శాతానికి పెంచాలని సీఎం కోరారు. రాష్ర్టాలు చెల్లించే అప్పుల కిస్తీలను కూడా 6 నెలల పాటు వాయిదా వేయాలన్నారు.