ఏప్రిల్‌ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

మన సరిహద్దు రాష్ట్రాల్లో కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ ఈ నెల 30వ తేదీ వరకు పొడగించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలతో రాకపోకలు ఉన్నాయి. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కఠినంగా ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలని చెప్పారు. అమలు చేస్తామని వెల్లడించారు. ఏప్రిల్‌ 30 తర్వాత లాక్‌డౌన్‌ను దశల వారిగా ఎత్తేస్తామని తెలిపారు. ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేస్తామన్నారు. ప్రాజెక్టుల కింద ఏప్రిల్‌ 15వ తేదీ వరకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. 

కేంద్రం, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారింది..
కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రాల, కేంద్రం ఆర్థిక పరిస్థితి దిగజారింది. లాక్‌డౌన్‌ కాలానికి సంబంధించి కేంద్రానికి కొన్ని విజ్ఞప్తులు చేశాం. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుబంధం చేయాలని కోరుతున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని 5 శాతం నుంచి 6 శాతానికి పెంచాలని ప్రధాని మోదీని కోరినట్లు వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితి ఈ వందేళ్లలో ఎప్పుడూ రాలేదు. రిజర్వ్‌ బ్యాంక్‌ చేసే సహాయాన్ని హెలికాప్టర్‌ మనీ అంటారు.  

క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ అనే ఆర్థిక విధానాన్ని కేంద్రం పాటించాలని సూచిస్తున్నాం. క్యూఈ పద్ధతి ద్వారా రాష్ర్టాలను ఆదుకోవాలని చెప్పాం. ప్రభుత్వాలను ఆదుకునేందుకు గవర్నింగ్‌ బ్యాంక్‌ ముందుకు రావాలి. మన దేశ జీడీపీ రూ.203 లక్షల కోట్లు ఉంది. క్యూఈ పద్ధతిలో చూస్తే మనకు రూ.10 లక్షల కోట్లు రావాల్సి ఉంది. పీఎం కేర్స్‌కు వర్తించే నిబంధనలు సీఎంఆర్‌ఎఫ్‌కు కూడా వర్తింపచేయాలని కోరామని తెలిపారు. 

పంట కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దు

పంట కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వెల్లడించారు.  తెలంగాణలో తొలిసారి రికార్డు స్థాయిలో 40 లక్షల ఎకరాల్లో పంటలు పండాయి.  ఈ సందర్భాన్ని ఘనంగా జరుపుకోవాలని గతంలో అనుకున్నాను. కరోనా పీడ వలను మనం సంతోషాన్ని కూడా పండగ జరుపుకోలేకపోతున్నాం. ఆహార విషయంలో మనం స్వయం సమృద్ధి సాధించాం. రైతులు కూడా ఐసోలేషన్‌ పాటిస్తూ సాగు పనులు చేసుకోవాలి. 

వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. అన్ని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నాం. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో లాక్‌డౌన్‌ ఉత్తమ విధానం. ప్రపంచాన్ని శాసించే దేశాలు కూడా కరోనా ధాటికి విలవిలలాడుతున్నాయి. అగ్రదేశాలతో పోలిస్తే మనం సురక్షిత పరిస్థితిలో ఉన్నాం. ముందుజాగ్రత్తగా చేపట్టిన చర్యల వల్లే మనం కోంత సురక్షిత స్థితిలో ఉన్నామని తెలిపారు. 

ఇదే స్పూర్తిని నెలాఖరు వరకు కొనసాగించండి…

లాక్‌డౌన్‌ స్పూర్తిని మరో 15 రోజులు కొనసాగించాలని తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి  చేశారు. మనలను మనం నియంత్రించుకుని ఇండ్ల నుంచి బయటకు వెళ్లకుండా ఉంటేనే  కరోనా నుంచి విముక్తి లభిస్తుందని సూచించారు. కొన్ని రాష్ర్టాలు 24 గంటలు కర్ఫ్యూ పెట్టుకున్నాయి. లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన సింగపూర్‌, జపాన్‌తో పరిస్థితి మళ్లీ తిరగబడింది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. కంటైన్మెంట్‌ జోన్‌లకు నిత్యావసరాల సరఫరా బాధ్యత ప్రభుత్వానిదే. 

 తినుబండారాలు, నూనెలు కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కల్తీకి పాల్పడిన వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అక్రమాలకు పాల్పడితే మానవత్వం ఉన్నట్లేనా అని ప్రశ్నించారు. ప్రజలు సొంతంగా ఇళ్లల్లో మాస్కులను తయారు చేసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల వైఖరిపై వైద్యారోగ్యశాఖ అధికారులు సమీక్షిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు క్లిష్టమైన సమయంలో చికిత్సకు నిరాకరించడం సరికాదు.  మర్కజ్‌ కేసులు లేకుంటే ఈ పాటికి మనం మెరుగైన స్థితిలో ఉండేవాళ్లమని తెలిపారు.