ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్ర ప్రజలంతా ఇప్పుడు సహకరించినట్లే.. మరో రెండువారాలపాటు కూడా స్వీయ నియంత్రణ పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో కొత్త కేసులు రాకుంటే ఈ నెల 24 నాటికి చికిత్స పొందుతున్నవాళ్లు, క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు పూర్తిగా డిశ్చార్జి అయిపోతారని, అదే జరిగితే.. మే ఒకటి నుంచి దశలవారీగా లాక్‌డౌన్‌ను సడలించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. రాష్ట్రంలో 1 నుంచి 9 వ తరగతి వరకు పరీక్షలు రద్దుచేస్తున్నామని.. విద్యార్థులందరినీ నేరుగా పై తరగతులకు ప్రమోట్‌చేస్తామని వెల్లడించారు. పదో తరగతి పరీక్షల గురించి ఆలోచిస్తామన్నారు. ఏప్రిల్‌ 15 వరకు అన్ని ప్రాజెక్టుల కింద సాగునీరు అందిస్తామని సీఎం చెప్పారు. ప్రస్తుత లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో వ్యవసాయాన్ని నరేగా పనులకు అనుసంధానంచేయాలని.. కనీసం రెండు నెలల వరకైనా ఇందుకు అనుమతించాలని ప్రధానిని కోరినట్లు పేర్కొన్నారు. శనివారం ఉదయం ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం.. రాష్ట్రం తరపున లాక్‌డౌన్‌ పొడిగించాలని కోరారు. దీంతోపాటు పలు డిమాండ్లను మోదీముందుంచారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై లాక్‌డౌన్‌ పొడిగింపుతోపాటు పలు నిర్ణయాలను తీసుకొన్నది. క్యాబినెట్‌ భేటీ అనంతరం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌.. ప్రధాని మోదీతో సమావేశం, క్యాబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
ఏప్రిల్‌ 30 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. శనివారం ప్రగతిభవన్‌లో మంత్రి మండలి నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. లాక్‌డౌన్‌ పొడిగింపుపై సీఎం వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే..
మన క్షేమంకోసమే..‘లాక్‌డౌన్‌ను కచ్చితంగా, కఠినంగా అమలుచేస్తాం. నేను ప్రజలను మరోసారి కోరుతు న్నా. దయచేసి ఈ లాక్‌డౌన్‌ మన క్షేమంకోసం, మన సమాజంకోసం, మన పిల్లల భవిష్యత్‌ కోసం.. అందరి మంచిని కాంక్షించి చేస్తు న్న పని. గతంలో ఏ విధంగా సహకరించారో.. ఇప్పుడూ సహకరించాలి. అన్ని మతాలు, కులాలు, వర్గాలవారు సామూహిక కార్యక్రమాలు మానుకోవాలి. నాలుగురోజులు ఓపికపడితే.. అదృష్టం బాగుండి కాలం కలిసివస్తే ఏప్రిల్‌ 30 తర్వాత లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేసే ఆలోచన చేయొచ్చు. ప్రధాని మోదీ ఈ రోజు అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మూడుగంటలపాటు సుదీర్ఘంగా సమావేశం జరిగింది.
అన్ని రాష్ర్టాలు అభిప్రాయం చెప్పాయి. అందరూ కచ్చితంగా లాక్‌డౌన్‌ను కనీసం రెండువారాలు పొడిగించాల్సిందేనని విజ్ఞప్తిచేశారు. ఒకరిద్దరు రెడ్‌జోన్‌, హాట్‌జోన్లకు పరిమితంచేయాలన్నరు. కానీ చాలామంది అంగీకరించలేదు. ఒకరిద్దరు సీఎంలు కొందరు వేరే రాష్ర్టాల వాళ్లున్నరు.. పోవాలనుకొంటున్నరు.. వాళ్లను పంపించడానికి ప్రత్యేక రైళ్లు పెట్టాలన్నరు కానీ.. అనుమతించలేదు. ఎక్కడివాళ్లు అక్కడ ఉంటేనే క్షేమం అని చెప్పాం. దేశాన్ని లాక్‌డౌన్‌ చేయడంలో ప్రధా ని సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకున్నారు. అన్ని రాష్ర్టాలు అనుసరించాయి. రాజకీయాలు పక్కనపెట్టి యావత్‌ దేశం ఒకే మూసలో పనిచేసినందునే కరోనా నియంత్రణలో ఉన్నది. ఇంకో 15-20 రోజులు ఇదేరీతిన ముందుకుపోతే కచ్చితంగా బయటపడే ఆస్కారం ఉంటది. ప్రపం చం ఎటుపోయినా మనల్ని మనం కాపాడుకోగలుగుతం. అందు కే కేంద్రం లాక్‌డౌన్‌ను ఈ నెల 30దాకా పొడిగించాలని డిమాండ్‌ చేస్తున్నా.

అద్భుతమైన ప్రజా సహకారం…కరోనావ్యాప్తిని నిరోధించేందుకు కేంద్రం తో సమన్వయం చేసుకుంటూ ముందుకుపోతున్నాం. వైరస్‌ నియంత్రణలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ మంచి స్థితిలో ఉంది. అద్భుతమైన ఆర్థికశక్తి.. ప్రపంచాన్ని శాసించే శక్తి, హెలికాప్టర్‌ అంబులెన్స్‌లు ఉన్న అమెరికాయే సతమతమవుతున్నది. అక్కడ రోజుకు దాదాపు రెండువేల మంది చనిపోతున్నరు. ఇంకో పదివేల మంది పరిస్థితి ఆందోళనకరంగా (క్రిటికల్‌) ఉన్నట్లు తాజా రిపోర్టులు చెప్తున్నాయి. అక్కడ 4 లక్షల మందికి పైగా వైరస్‌ సోకింది. మనదేశంలో ఏడువేల పైచిలుకు మాత్రమే ఎఫెక్ట్‌ అయ్యారు. మరణాలు ఈరోజు వరకు 300 లోపు ఉన్నాయి. 135 కోట్ల జనాభాను చూసుకుంటే మనం మంచి నియంత్రణలోనే దేశాన్ని ఉంచుకున్నట్లు లెక్క. దీనికి ప్రజలు ఇచ్చిన సహకారమే అన్నింటికంటే ముఖ్యమైంది. వాళ్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
ఏం తప్పు చేశామోగానీ.. మాకీ శిక్ష చాలు..ప్రజలు ఇంకొంచెం సమయం ఓపిక పడితే కచ్చితంగా ఈ గండం నుంచి బయటపడతం. భగవంతుడిని నిండు మనసుతో ప్రార్థిస్తున్నాం. మేం ఏం తప్పు చేశామోగానీ మాకీ శిక్ష చాలు. ఏప్రిల్‌ 30 వరకు దేశం నుంచి ఈ మహమ్మారిని తరిమివేస్తే కనీసం పనిచేసి బతుకుతం. అందుకే ఆ వెసులుబాటు కల్పించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఈ గండం నుంచి బయటపడేందుకు ప్రజలు సహకరించాలి. ఇప్పటివరకు కులం, మతం, జాతి అని తేడా లేకుండా ఎలా ముందుకు పోతున్నారో ఇక ముందుకూడా అలాగే పోవాలి.
యంత్రాంగం దృష్టంతా కరోనాపైనేప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు కరోనాపైనే దృష్టి పెట్టారు. కలెక్టర్లు, కమిషనర్లు, ఎస్పీలు అందరు అధికారులు కరోనా సోషల్‌ ట్రాన్స్‌మిట్‌ కావద్దనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. కంటైన్మెంట్‌ చేయడం, ఐసొలేషన్‌, హోం క్వారంటైన్‌లో పెట్టడం, హాస్పిటల్‌లో ఉంచడం వెనుక ఉద్దేశం కరోనా వ్యాప్తి కావద్దనే. పాజిటివ్‌ వచ్చినవారు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే.. గాంధీ దవాఖానలో ఉండాల్సిందేనని గతంలోనే చెప్పాను. ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండటం వేరు.. ఎక్కడో ప్రైవేట్‌ దవాఖానలో ఉంచితే ఎవరు కాపలాకాయాలి? ఎవరు చూడాలి? అదే గాంధీలో 1,500 బెడ్ల వరకు అవకాశం ఉన్నది. అక్కడ వేరేవారిని లోపలికి పంపించడంలేదు. పోలీ సు బందోబస్తు పెట్టించాం. దవాఖాన సిబ్బందికి పాసులు ఇచ్చాం. రోగుల బంధువులను కూడా బయటే ఉంచుతున్నాం. రేయింబవళ్లు పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందిపై రోగులు, బంధువులు ఎమోషనలై కొడుతున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చికిత్సచేస్తున్నవారిని కొట్టడం దుర్మార్గం.
ప్రైవేటులో కరోనా టెస్టులకు అవకాశం ఇవ్వంకరోనా నిర్ధారణకు సంబంధించి నేనే ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకూడదన్నాను. రోజుకు వెయ్యి టెస్టులుచేసే కెపాసిటీ ప్రభుత్వానికి ఉన్నది. వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌లలో టెస్టులుచేస్తున్నం. నెగెటివ్‌ వస్తే వెళ్లిపోమంటం. పాజిటివ్‌ వస్తే ఏం చేస్తాం? వందశాతం తక్షణమే నోటిఫైడ్‌ దవాఖానలో పెడ తాం. అక్కడ సకల హంగులున్నయ్‌. ఏయే మందులు వాడాలి? టెంపరేచర్‌ తగ్గాలంటే ఏం చేయాలి? వైద్యుల పర్యవేక్షణలో చికిత్సలు జరుపుతాం. ఇండోనేషియా వాళ్లు వస్తే ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్‌లు కావాలంటే ఇచ్చినం. తేనె కావాలన్నారు.. కావాల్సిన భోజనం కూడా పెట్టినం. ప్రభుత్వ దవాఖాన అయితే క్వారంటైన్‌ ఎక్కడ పెట్టాలో సూచి స్తాం. ధైర్యమిస్తాం. నిరుపేదలైనా, ధనికులైనా సరే.. పూర్తిగా మన కంట్రోల్‌లో ఉంటది. ప్రైవేటుకు అయితే ఎక్కడ పోవాలె..? ప్రాక్టికల్‌గా చాలా కష్టం. ఇదో టెర్రిఫిక్‌, డ్రెడ్‌ఫుల్‌ వైరస్‌. సమాజాన్ని కాపాడుకోవాలంటే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటది. సుప్రీంకోర్టు కరోనా కేసులను ప్రైవేటు దవాఖానలు కూడా చూడవచ్చని చెప్పింది. కానీ పేషంట్ల నుంచి ఫీజు తీసుకోవద్దన్నది. దీంతో ఇప్పుడు ప్రైవేటు దవాఖానల వాళ్లు కనిపిస్తలేరు.

పరీక్షలుచేయడం పెద్ద తతంగంకరోనా టెస్టులు చేయాలంటే ఒక పద్ధతి, వ్యవస్థ, స్కేల్‌ ఉంటది. 25 వేల మందికి తెలంగాణ ప్రభుత్వం కరోనా టెస్టులు చేసింది. కొందరిని డిశ్చార్జి చేసినం. 14 రోజులున్నా నెగెటివ్‌ రావాలె. చెస్ట్‌ ఎక్స్‌రే తీయాలె. దానికో పెద్ద తతంగం ఉన్నది. రెండుసార్లు నెగెటివ్‌ రావాలె. ఇవన్నీ చూసుకోకుండా పంపిస్తే.. సమాజంలోకి మనం టైం బాంబ్‌ పంపించినట్లే. ఒక్కొక్కడు పదివేల మందికి అంటిస్తడు. అందుకని అంత ఈజీగా డిశ్చార్జి చేయం. అక్కడో బోర్డు ఉంటది. వాళ్లు డిశ్చార్జి చేయాలంటేనే చేస్తం. ఇండియాలో మొత్తం కంట్రోల్‌లోకి వచ్చింది. 135 కోట్ల జనాభాలో ఏడువేల లోపే ఉన్నది. నిజాముద్దీన్‌ లేకపోతే మనం ఆరాంగా ఉండేవాళ్లం. మాములుగా ఒకటో రెండో వస్తే దర్జాగా చేసుకుంటూ ఉండేవాళ్లం. భయమేమిటంటే, ఎప్పుడేరకంగా పెరుగుతుందో తెలియని పరిస్థితి.
మాస్కులను ఇంట్లో తయారు చేసుకోవాలె..మాస్కులను ఎవరికివారు ఇంట్లనే తయా రుచేసుకోవాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. అవసరమైతే దస్తీ కట్టుకోవాలని, భేషజాలకు పోవద్దని సూచించారు. మద్యంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘నో లిక్కర్‌.. సారీ’ అని వ్యాఖ్యానించారు.
మరింత కఠినంగా అమలులాక్‌డౌన్‌ కఠినంగానే ఉంటది. ఎందుకంటే, నలుగురు కలిస్తే మళ్లీ ప్రమాదం వస్తది. ఉదాహరణకు సింగపూర్‌ను తీసుకుంటే.. అదో చిన్న దేశం. కరోనా పోయిందని లాక్‌డౌన్‌ ఎత్తేశారు. మళ్లీ ఇప్పుడు నెలరోజులపాటు లాక్‌డౌన్‌ పెట్టుకున్నరు. జపాన్‌లో కూడా అదే జరిగింది. ఇదో వింత విచిత్రమైన వ్యాధి. ఎవరూ తెలిసి పాపం మూటగట్టుకోరు. పెద్ద ట్రాజెడీ ఏందంటే వైరస్‌ సోకిన వ్యక్తికి కరోనా వచ్చిన సంగతి తెలియదు, అది బయటపడదు. కొంతకాలానికి బయటపడుతుంది. కానీ, అప్పటికే అది ఇతరులకు సంక్రమిస్తది. అతడు మం చిగనే ఉన్నాననుకొని నార్మల్‌గానే బిహేవ్‌ చేస్తడు. హోటల్‌కెళ్తడు, తింటడు, పెండ్లికి, ఫంక్షన్లకు పోతడు. సమాజంలో తిరుగుతడు. ఆ తర్వాత ఆ వ్యాధి ఉందని బయటపడేటప్పటికి అతని ద్వారా ఎంతమందికి సంక్రమించిందో తెలియదు. ఇప్పుడు మన పరేషాన్‌ అదే. నిజాముద్దీన్‌ పోయి వచ్చినవాళ్లు ఎవరిని కలిసిండ్రు, ఏ టైమ్‌ లో కలిసిండ్రో తెలియదు. ఇది రోకలిబండను తలకాయకు చుట్టుకుంటున్నట్టు ఉన్నది. కాబట్టి నియంత్రించాలి. అంటే, వారిని ఆ ఏరియాలకే పరిమితంచేస్తే అది ప్రబలకుండా ఉంటది. మనది చిన్నదేశం కాదు.. కాబట్టి, మనకు ఈ బాధలు తప్ప వు. ప్రజల కనీస అవసరాలకు సంబంధిం చి కొన్ని జాగ్రత్తలు తీసుకొంటూ ముందుకుపోవడం మంచిది. కంటైన్మెంట్‌ ప్రాంతా ల్లో సరుకులను డోర్‌ డెలివరీ చేస్తున్నాం. దేశం మొత్తం ఇదే పద్ధతిని పాటిస్తున్నది.
ఏకతాటిపై నిలిచిన భారతావనికరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశాన్ని, రాష్ర్టాల్ని కాపాడుకోవాలని కేంద్రం, రాష్ర్టాలు ఒక్క తాటిపై నిలిచి, రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు గొప్ప స్ఫూర్తితోటి ప్రధానమంత్రికి అప్పీలుచేశారు. ప్రధాని కూడా అదేరీతిన అప్పీలుచేశారు. అందరం కలిసి ఈ దేశాన్ని కాపాడుకొందామని అనుకొన్నాం. ఇప్పుడు విమానాలు, రైళ్లు నడువవు. ప్రధానమంత్రి దీనిపై అతిత్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నది. బహుశా రేపు జాతికి సందేశం ఇచ్చి ప్రకటిస్తారేమో? కొన్ని పాలసీలు కూడా ప్రకటించవచ్చు. కేంద్రం నుంచి నిర్ణయం కోసం వేచి ఉన్నాం.
రాష్ట్ర సరిహద్దుల్లో కఠినంగా లేకపోతే కాపాడుకోలేం మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 11 మంది చనిపోయారు. రాజస్థాన్‌లో 117 కొత్త కేసులు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రతో మనకు దాదాపు 500 నుంచి 600 కిలోమీటర్ల బార్డర్‌ ఉంది. లక్ష్మి బరాజ్‌ నుంచి మొదలుపెడితే పూర్తిగా ప్రాణహిత నది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నారాయణఖేడ్‌ వరకు కర్ణాటక బార్డర్‌ టచ్‌ అయ్యేదాకా మనకు మహారాష్ట్ర బార్డర్‌ ఉంటుంది. మన బం ధుత్వాలు, రాకపోకలు, వ్యాపారకలాపా లు ఈ ప్రాంతం నుంచి చాలా ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర బార్డర్‌లో కఠినంగా వ్యవహరిస్తే తప్ప మన రాష్ర్టాన్ని కాపాడుకోలేం. మహారాష్ట్ర బోర్డర్‌ను సీజ్‌ చేయాల్సి వస్తున్నది.. ఇయ్యాలో, రేపో కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటది.
రాష్ట్రంలో 243 కంటైన్మెంట్‌ ప్రాంతాలుకరోనావ్యాప్తిని కచ్చితంగా అరికట్టాల్సిందే. ప్రజల ప్రాణాలు కాపాడుకోవాల్సిందే. ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఇతరదేశాల నుంచి వచ్చినవాళ్లు 34 మంది.. వాళ్లద్వారా వైరస్‌ సోకిన మరికొందరు వందశాతం డిశ్చార్జి అయ్యారు. తొలిదశలో క్వారంటైన్‌ అయిన 25,937 మంది కూడా డిశ్చార్జి అయ్యారు. తాజా గణాంకాలను చూస్తే శనివారం సాయంత్రం వరకు పాజిటివ్‌ కేసులు 503. వీరిలో 14 మంది చనిపోగా, 96 మందికి నయమై డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దవాఖానల్లో 393 యాక్టివ్‌ కేసులున్నాయి. మర్కజ్‌కు వెళ్లివచ్చిన 1,200 మందితోపాటు వారి కుటుంబసభ్యులు, సన్నిహితంగా ఉన్నవారందరినీ గుర్తించాం. పరీక్షలు చేయించాం. ఇప్పుడు క్వారంటైన్‌లో 1,654 మంది ఉన్నారు. కొత్తగా కేసులు రావడం తగ్గింది. వ్యాధి ప్రబలకుండా ఉండటానికి రాష్ట్రవ్యాప్తంగా 243 కంటైన్మెంట్‌ ప్రాంతాలను గుర్తించి నిబంధనలు కఠినంగా అమలుచేస్తున్నాం. జీహెచ్‌ఎంసీ పరిధిలో 123, ఇతర ప్రాంతాల్లో 120 నియంత్రిత ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లో రాజీపడేది లేదు. ఈ ప్రాం తాల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. దవాఖానల్లో చికిత్స పొందుతున్నవారు కానీ, కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో కానీ ఎవరూ సీరియస్‌గా లేరు. భగవంతుడి దయవల్ల మనకు ఈ సంక్రమణ తగ్గిపోతే బహుశా ఏప్రిల్‌ 24 వరకు పరిస్థితి బాగుపడుతుంది. దవాఖానల్లో ఉన్న వాళ్లకు నెగెటివ్‌ వస్తే డిశ్చార్జి కావడం, క్వారంటైన్‌ వాళ్లు విడుదల కావడం జరుగుతుంది. కొత్త ఉప్పెన, కొత్త ఉత్పాతం రాకుంటే ఈ కరోనా నుంచి మనం బయపటపడ్డవాళ్లమవుతాం.