గుంటూరు జిల్లా దాచేప‌ల్లిలో 144 సెక్ష‌న్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. గుంటూరు జిల్లాలో ప‌రిస్థితి మ‌రింత తీవ్రంగా ఉంది. శుక్ర‌వారం జిల్లాలో 14 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. గుర‌జాల రెవెన్యూ డివిజ‌న్‌ దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నారాయణపురంలో ఒక టీబీ రోగి క‌రోనా సోకి మ‌ర‌ణించాడు. దీంతో అధికారులు అప్రమతమ‌య్యారు. కరోనా లక్షణాలతో మృతిచెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడారు.

మృతిచెందిన వ్యక్తి అంత‌కుముందు 13 మందితో సన్నిహితంగా ఉన్నట్లు, మరో 34 మందిని ఏదో ఒక సంద‌ర్భంలో క‌లిసిన‌ట్లు అధికారులు గుర్తించారు. వారిలో 13మందిని కేఎల్‌ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రానికి,  34 మందిని దాచేపల్లి ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. మృతుడి ఇంటి పరిసర ప్రాంతాల‌ను రెడ్‌జోన్‌గా ప్రకటించి, దాచేప‌ల్లి అంతటా 144 సెక్ష‌న్ విధించారు.