
లాక్‌డౌన్ అమలు, కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా 32 మందికి కరోనా వచ్చిందని, ఒక వ్యక్తి మరణించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రోజుకు వెయ్యి నుంచి 1100 మందికి పరీక్షలు నిర్వహించేలా అన్ని ల్యాబ్‌లు, అస్పత్రులను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎన్ని కేసులొచ్చినా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 17 మంది మృతిచెందారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో నగరంపై ప్రత్యేదృష్టి కేంద్రీకరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్‌ను 17 జోన్లుగా విభజించి ఒక్కో జోన్‌ను యూనిట్‌గా పరిగణించి ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. పాజిటివ్ కేసులు నమోదైన కంటైన్‌మెంట్ జోన్లను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.