
రాష్ట్రంలో కరోనా విజృంభణ ఆగటంలేదు. తగ్గినట్టు కనిపిస్తూనే.. ఒక్కసారిగా పంజా విసురుతున్నది. సోమవారం ఒక్కరోజే 61 మందికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో ప్రకటించడంతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఈ నెల మొదటివారంలో అత్యధికంగా కేసులు నమోదైన తరువాత.. ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఆ కేసులన్నీ కూడా ఢిల్లీ నిజాముద్దీన్‌లోని తబ్లిగీ జమాత్‌కు వెళ్లివచ్చిన వారివే కావడంతో.. వైరస్ మరింత వ్యాప్తిచెందకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొన్నది. దాని ఫలితంగా ఈ నెల 9 నుంచి కేసులు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. అంతా సవ్యంగా ఉంటే.. ఈ నెల 24 కల్లా పాజిటివ్ వచ్చినవారందరికీ నయంకావడంతోపాటు, క్వారంటైన్‌లో ఉన్నవారంతా డిశ్చార్జి అయిపోతారని కూడా ప్రభుత్వం అంచనావేసింది. ఎందుకంటే తొలిదశలో విదేశాల నుంచి వచ్చినవారికి.. వారిద్వారా సంక్రమించిన వారికి కరోనాను పూర్తిగా నయం చేసి ఇండ్లకు పంపించారు.
రెండోదశలో బయటపడ్డ కేసులన్నీ కూడా మర్కజ్‌కు వెళ్లివచ్చినవారివే కావడంతో.. వేగంగా స్పందించి.. వారిని, వారు కలిసిన వారిని గుర్తించి చికిత్స ఇవ్వడంతోపాటు.. క్వారంటైన్‌లో ఉంచడంతో.. పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతాయని భావించారు. ఈ క్రమంలో సోమవారం పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు రావడంతో కరోనా వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 592కు చేరుకోవడం తీవ్రంగా ఆందోళన కారణమవుతున్నది. సోమవారం ఒక రోగి మరణించడంతో కరోనా మృతుల సంఖ్య కూడా 17కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో నిర్ణయించిన 228 కంటైన్మెంట్ క్లస్టర్ల పరిధిలోని 6,41,194 ఇండ్లల్లో 27,32,644 మందికి సంబంధించి వైద్య బృందాలు సర్వే నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నది. ప్రభుత్వం మరింత కట్టుదిట్టంగా నియంత్రణ చర్యలను చేపట్టినట్లు తెలిపింది.

హైదరాబాద్‌లో భయం భయం
రాష్ట్రవ్యాప్తంగా చికిత్స పొందుతున్న కరోనా రోగుల సంఖ్య 472కు పెరిగింది. ఒక్క హైదరాబాద్‌లోనే 216 మంది రోగులు చికిత్స పొందుతున్నారంటే.. ఇక్కడ వైరస్ తీవ్రత ఏవిధంగా ఉన్నదో అర్థంచేసుకోవచ్చు. హైదరాబాద్ తరువాత నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలో అధికంగా కేసులు నమోదయ్యాయి. అనుమానితులను క్వారంటైన్‌లో ఉంచి నా.. వైరస్ వ్యాప్తికి సంబంధించి ప్రభావిత ప్రాంతాలను గుర్తించి దిగ్బంధంచేసినా.. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళనలు మొదలయ్యాయి. కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని భయపడుతున్నారు. ప్రజలు మరింత కఠినంగా స్వీయ నియంత్రణ, నిర్ణీత దూరం పాటిస్తూ ఇండ్లకే పరిమితం కావాలని వైద్యా రోగ్యశాఖ సోమవారం మరోసారి హెచ్చరించింది.
మూడోసారి అధిక కేసుల నమోదు
రాష్ట్రంలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇది మూడోసారి. ఏప్రిల్ 3వ తేదీన అత్యధికంగా 75 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 5వ తేదీన 62 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఈనెల 10, 11 తేదీల్లో వరుసగా రోజుకు 16 కేసులు, 12న 28 కేసులు వచ్చాయి. వైరస్ తగ్గుదలకు ఇది సానుకూల సంకేతమని భావిస్తున్న సమయంలోనే సోమవారం ఏకంగా 61 కేసులు నమోదు కావడం ఆలోచించాల్సిన విషయం. మార్చి 2న తొలి కేసు నమోదైతే.. ఆరువారాల్లో 592కు చేరుకున్నాయి.