లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. తాగేంత స్వచ్ఛంగా మారిన గంగానది

గత 20 రోజులుగా లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో దేశంలో ఏన్నో మార్పులు జ‌రుగుతున్నాయి. వాహ‌నాల‌తో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు ఇప్పుడు ప్ర‌శాంతంగా ఉన్నాయి. ర‌వాణా జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ప్లాస్టిక్ త‌గ్గుముఖం ప‌ట్టింది. అంతేకాదండోయ్‌.. ద‌గ్గ‌రికి వెళ్తే మురికి వాస‌న వ‌చ్చే హుస్సేన్‌సాగ‌ర్ కూడా ఇప్పుడు కాస్త పరవాలేదు. నిన్నటివరకు కాలుష్యంతో కొట్టుమిట్టాడిన గంగానది ప్రస్తుతం నేరుగా తాగేంత స్వచ్ఛంగా మారింది. న‌ది లోప‌ల అడుగు బాగాన ఉండే చేప‌లు, ఇత‌ర జీవ‌చ‌రాలు సైతం కంటికి క‌నిపిస్తున్నాయి. గంగానది నీటి నాణ్యత 45శాతం వరకు మెరుగు పడినట్లు పరిశోధకులు తెలిపారు.

ఎప్పుడూ చూడ‌ని విధంగా లాక్‌డౌన్ ప్రకృతిలో ఎంతో మార్పు తీసుకువచ్చిందని జనం ఆనంద‌ప‌డుతున్నారు. గంగాన‌ది నీటిని శుభ్ర‌ప‌రిచేందుకు ప్ర‌భుత్వాలు ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. అయినా ఫ‌లితం లేదు. లాక్‌డౌన్ ఆ ప‌నిని నెర‌వేర్చింది. న‌దిలో మునిగేందుకు ఇబ్బంది ప‌డే ప్ర‌జ‌లు ఏకంగా తాగే విధంగా గంగాన‌ది మారిపోవటంతో అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.