అనంతపురం జిల్లాలో తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఓ తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. హిందూపురంలో నివసిస్తున్న తహసీల్దార్‌ అనారోగ్యంతో కొద్దిరోజులుగా విధులకు హాజరుకావట్లేదు. కోవిడ్‌-19 లక్షణాలు కనిపించడంతో శాంపిల్స్‌ సేకరించి కరోనా టెస్టింగ్‌కు పంపగా కరోనా సోకినట్లు తేలింది. వెంటనే జిల్లా కోవిడ్‌ ఆస్పత్రికి బాధితుడిని తరలించారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్‌తో సన్నిహితంగా ఉన్నవారందరిని క్వారంటైన్‌కు తరలించారు. ఈ తహసీల్దార్ మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామితో పలుసార్లు సమావేశమైనట్లు అధికారులు గుర్తించారు.