రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి లేదు : మంత్రి ఈటల

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సామాజిక వ్యాప్తి లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మీడియా ద్వారా మంత్రి మాట్లాడుతూ… మర్కజ్‌ ఘటన తర్వాతే తెలంగాణలో కరోనా కేసులు పెరిగాయన్నారు. 1250 మందికి పైగా ఢిల్లీ మర్కజ్‌ వెళ్లొచ్చారు. వీరందరినీ దాదాపు గుర్తించి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. నియంత్రిత ప్రాంతాల్లోని ప్రతిఒక్కరి ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. కరోనాపై సీఎం కేసీఆర్‌ నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపారు.  డయాలసిస్‌, తలసేమియా రోగులకు నిరాటంకంగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రోజూ 1100 నుంచి 1200 వరకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఆయా నియంత్రిత ప్రాంతాల్లో పకడ్బందీగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. నియంత్రిత ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన సరుకులను అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా లక్షణాలు లేకపోయినా కొంతమందికి పాజిటివ్‌ వస్తోందన్నారు. కరోనా సోకిన వారు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. కరోనా విషయంలో ఎవరూ కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దని మంత్రి కోరారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటిస్తూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్నారు.