స్పందించిన ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్

కేంద్ర హోంశాఖకు రాసిన లేఖపై ఎట్టకేలకు ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్పందించారు. గత కొద్దిరోజులుగా ఈ లేఖపై రాజకీయ దుమారం కొనసాగుతుండగా.. తాజాగా ఆయన స్పందించారు. ఆ లేఖ తానే రాశానని ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు రమేష్ కుమార్. కాగా రమేష్ కుమార్ రాసిన లేఖపై అనుమానాలున్నాయని.. దానిపై విచారణ జరపాలని ఏపీ డీజీపీకి విజయసాయి రెడ్డి   లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖ రాసి కొన్ని గంటలు కూడా గడవకముందే రమేష్ కుమార్ స్పందించారు. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారు.  అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్. ఆ తరువాత కొద్ది రోజులకు జగన్ ప్రభుత్వంపై ఆయన కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. అందులో ఎన్నికలను వాయిదా వేసిన తరువాత తనను సీఎం జగన్ బెదిరించేలా మాట్లాడారని, మంత్రులందరూ వంతులవారీగా తనపై ఆరోపణలు గుప్పించారని వాపోయారు. చివరికి స్పీకర్‌ సైతం తనపై తీవ్ర స్థాయిలో మాటల దాడి చేశారని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు తొలివిడత జరిగిన ఎన్నికల్లో హింస జరిగిందని.. కడప జిల్లాలో చాలా ఏకగ్రీవాల జరిగాయని అందులో వెల్లడించారు. తనకే కాదు.. తన కుటుంబ సభ్యులకు కూడా బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని రమేష్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని.. ప్రస్తుతమైతే హైదరాబాద్‌ నుంచే విధులు నిర్వహిస్తానని తెలిపారు.