
ఈ నెల 19న మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ రవకు యథావిధిగా కొనసాగించడమా? లేక కేంద్ర ప్రభుత్వ ఆలోచన ప్రకారం ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వడమా? అనే అంశాలపై చర్చించి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోనుంది.
రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు వైద్యారోగ్య, పోలీసు శాఖలతో సమీక్షలు నిర్వహించి.. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు కూడా ప్రజలు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల క్రితం తేల్చిచెప్పిన విషయం విదితమే.