
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కరోనా పరీక్ష చేయించుకున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎంకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. సౌత్ కొరియా నుంచి వచ్చిన కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా టెస్ట్ చేశారు. పరీక్షల్లో సీఎం జగన్‌కు కరోనా నెగెటివ్ వచ్చింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలను వేగవంతం చేసేందుకు లక్ష ర్యాపిడ్ కిట్లు ఆర్డర్ ఇచ్చింది. సియోల్ నుంచి ప్రత్యేక చార్జర్ విమానం ద్వారా శుక్రవారం ఆ ర్యాపిడ్ కిట్లు గురువారం నాడు ఏపీకి చేరుకున్నాయి.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ టెస్టు కిట్లను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందుకొని పరిశీలించిన అనంతరం తొలి పరీక్ష చేయించుకున్నారు. ర్యాపిడ్ కిట్ల ద్వారా కేవలం 10 నిమిషాల్లో కరోనా ఫలితం వస్తుందని అధికారులు చెప్పారు. ఈక్రమంలో రాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా కరోనా పరీక్షలు చేసే విధానంపై ఇప్పటికే అన్ని జిల్లాల్లోని డాక్టర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ కిట్ల ద్వారా అన్ని కరోనా ఆస్పత్రుల్లోనూ పరీక్షలను వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్రంలో రాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులోకి రావడంతో రేపటి నుంచి మరింత వేగంగా పరీక్షలు జరగనున్నాయి.