లాక్‌డౌన్ మినహాయింపులో భాగంగా కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలపై ఆంక్షలను సడలిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మినహాయింపుల కోసం పాటించాల్సిన విధానాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర హోంశాఖ, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిబంధనలను అనుసరించి మినహాయింపులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పరిశ్రమల శాఖ అధికారులు, రవాణా, కార్మిక శాఖ అధికారులకు ప్రభుత్వం పంపించింది. రెడ్‌జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో ఈ ఉత్తర్వులు వర్తించవని తెలిపారు.
మినహాయింపులు వర్తించేది వీటికే..
- ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమలు, రైస్, పప్పు మిల్లులు, పిండిమరలు, డైరీ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు .
- ఆర్వో ప్లాంట్లు, ఆహారోత్పత్తి పరిశ్రమలు, ఔషధ తయారీ సంస్థలు, సబ్బుల తయారీ కంపెనీలు, మాస్కులు, బాడీ సూట్లు తయారీ సంస్థలు. శీతల గిడ్డంగులు, ఆగ్రో పరిశ్రమలు, బేకరీ, చాక్లెట్ల తయారీ సంస్థలు, ఐస్‌ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు.
- ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాలు కొనసాగింపు.
- ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతుల యూనిట్లకు. విశాఖలోని మెడ్‌టెక్ జోన్ తదితర పరిశ్రమలు.
- ఐటీ హార్డ్‌వేర్ తయారీ సంస్థలు, బొగ్గు ఉత్పత్తి, చమురు, గ్యాస్ ఉత్పత్తులు.
- వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సులు, శాస్త్రవేత్తలు, పారామెడికల్ సిబ్బంది ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి.
- వీరు విమాన సర్వీసులను కూడా వినియోగించుకోవచ్చు.
- రహదారుల నిర్మాణం, జల వనరుల ప్రాజెక్టుల నిర్మాణాలకు అనుమతి.
- ఐటీ, ఐటీ ఎనెబుల్డ్ సంస్థల్లో 50శాతం మంది ఉద్యోగులతో పనిచేసుకోవచ్చు.
- డేటా, కాల్‌సెంటర్లు ప్రభుత్వ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం.
- అన్ని సరుకు రవాణా వాహనాలు, రైళ్లలో సరుకు రవాణాకు అవకాశం.
- విమానాశ్రయాలు, పోర్టుల్లో కార్గోకు అవకాశం. కార్మికులకు ప్రత్యేక రక్షణ చర్యలు తప్పనిసరి
- పరిశ్రమల్లో భౌతిక దూరం పాటిస్తూ, సిబ్బంది మాస్కులు ఇచ్చి, పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి.
- రీసార్ట్ అనే విధానం ప్రకారం పరిశ్రమలు పనిచేయాలి.
- వాహనాల్లో 30శాతం మంది కార్మికులను మాత్రమే పరిశ్రమలకు తరలించాలి.
- లాక్‌డౌన్ సమయంలో పనిచేస్తున్న వారందరికీ వైద్యబీమా తప్పనిసరి.
- పదిమంది కంటే ఎక్కువ గుమిగూడకుండా చూడాలి.
- గుట్కా, పాన్‌లు నమిలి ఉమ్మి వేయటంపై నిషేధం.
- ఉత్పత్తి ప్రదేశాల్లోకి బయటి వ్యక్తులు ప్రవేశకుండా చూసుకోవాలి.