ఇప్పటికే కోటికి పైగా మొక్కలను నాటాను. భవిష్యత్‌లో సీడ్‌తో మరో 3 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నానని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా అడవుల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వనజీవి దంపతులకు మంత్రి హరీష్‌రావు శనివారం ఉదయం అల్పాహారం ఇచ్చారు. ఈ సందర్భంగా రామయ్యతో మంత్రి ముచ్చటించి ఆయన జీవనస్థితిగతుల గురించి ఆరా తీశారు.
ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కలు నాటుతున్నారు.. మొక్కలు ఎందుకు నాటాలనిపించింది.. మీ బతుకుదెరువు ఏంటి అని రామయ్యను హరీష్‌రావు అడిగారు.
ఇందుకు రామయ్య బదులిస్తూ.. తన ఐదో ఏటా నుంచే వనం అంటే ఇష్టపడేవాడిని. మానవ మనుగడకు చెట్లే కీలకం కాబట్టి.. అప్పట్నుంచి మొక్కలు నాటుతున్నాను అని చెప్పారు. మొక్కల నుంచి పూలు, పండ్లు, ఔషధాలతో పాటు స్వచ్ఛమైన గాలి కూడా వస్తుందన్నారు. కన్నతల్లి లాంటి చెట్టును కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఇక బతుకుదెరువు విషయానికి వస్తే.. గతంలో వ్యవసాయం చేశాను. నష్టం రావడంతో వదిలేశాను. ఇప్పుడు తన కుమారుడు వ్యవసాయం చూసుకుంటున్నాడని తెలిపారు.
మీరు ఈ సమాజానికి గొప్ప ఆదర్శప్రాయులు అని రామయ్యతో మంత్రి చెప్పుకొచ్చారు. వనజీవి రామయ్య జీవితం, మొక్కలపై ఆయనుకున్న మక్కువ, వాటిని ఎలా పెంచుతున్నారనేది ప్రజాప్రతినిధులు అందరూ తెలుసుకోవాలని మంత్రి హరీష్‌రావు సూచించారు.