అథ్లెటిక్స్‌లో సత్తాచాటుతున్న ముగ్గురు నిరుపేద క్రీడాకారిణులకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వీ. శ్రీనివాస్‌గౌడ్ స్కూటీలు ప్రదానం చేశారు. స్ప్రింటర్ జె దీప్తి (100 మీటర్లు), జి మహేశ్వరి (స్టీపుల్‌చేజ్), ఏ నందిని (హర్డిల్స్, లాంగ్‌జంప్) ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తూ రాష్ట్ర ఖ్యాతిని పెంచుతున్నారు. దీంతో వారికి ప్రోత్సాహకంగా మంగళవారం రవీంద్రభారతి ప్రాంగణంలో రూ. 10 వేల నగదుతో పాటు స్కూటీలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘నిరుపేద కుటుంబాలకు చెందిన ఈ ముగ్గురు అమ్మాయిలకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చిన రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షులు చాముండేశ్వరినాథ్, కృష్ణకు అభినందనలు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ర్టాన్ని క్రీడా హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నాం. నియోజకవర్గానికి ఒక స్టేడియం ఏర్పాటు చేస్తున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్, నాగపురి రమేశ్, చాముండేశ్వరినాథ్, స్టాన్లీ, సారంగపాణి, జగదీశ్ యాదవ్, సోమేశ్వర్ రావు, రాఘవరెడ్డి, సాయి కృష్ణ, ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్ తదితరులు పాల్గొన్నారు.
