తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకొనేందుకు దేవుడితోనైనా కొట్లాడతానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. అసలు తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని.. ఈ నేపథ్యంలో సాధించుకున్న తెలంగాణ కోసం గోదావరి, కృష్ణా నదీజలాల్లో హక్కుగా వచ్చే ప్రతి నీటిబొట్టునూ వినియోగించుకొని తీరుతామని స్పష్టంచేశారు. నదీ జలాలను ఒడిసి పట్టుకొని సాగునీటి రంగాన్ని బలోపేతంచేస్తూ బీడు భూములను మాగాణంగా మారుస్తున్నామని చెప్పారు. పంటల దిగుబడిలో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా నిలిచాడని, రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారిందని అన్నారు. కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో ఈ నెల 6వ తేదీన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరుగనున్న నేపథ్యంలో గురువారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశాన్నినిర్వహించారు. అపెక్స్ భేటీలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారుచేశారు. తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు.
లోతుగా సమీక్షించిన సీఎం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, వాటి పరిష్కారంలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు, కేంద్రం వహించిన నిర్లక్ష్యం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించినట్టు తెలిసింది. ఎలాంటి అనుమతుల్లేకుండా ఏపీ ఏకపక్షంగా చేపడుతున్న ప్రాజెక్టులు, రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కృష్ణాజలాల కేటాయింపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి చేసిన వినతులు, వాటిని కేంద్రం పెడచెవిన పెట్టిన వివరాలన్నింటిపైనా సమీక్షించినట్టు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులనే తెలంగాణ ప్రభుత్వం పూర్తిచేస్తుంటే.. ఏపీ మాత్రం వాటిని కొత్త ప్రాజెక్టులుగా చిత్రీకరిస్తున్నదని.. ఆ రాష్ట్ర వాదనను తిప్పి కొట్టేందుకు అవసరమైన అన్ని జీవోలు, డాక్యుమెంట్లను సిద్ధంచేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. అపెక్స్ కౌన్సిల్ వేదికగా అన్ని ఆధారాలతో కేంద్రం, ఏపీ వైఖరిని ఎండగట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. సమావేశంలో రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు అబ్రహం, సురేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీశ్‌శర్మ, సీఎంవో అధికారులు నర్సింగ్‌రావు, భూపాల్‌రెడ్డి, జలవనరులశాఖ సలహాదారు ఎస్కే జోషి, ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీలు మురళీధర్‌రావు, బీ నాగేందర్రావు, హరిరాం, చీఫ్ ఇంజినీర్లు నర్సింహ, శంకర్, రమేశ్, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.
నదీ జలాలను ఒడిసి
పట్టుకొని సాగునీటి రంగాన్ని బలోపేతంచేస్తూ బీడు భూములను మాగాణంగా మారుస్తున్నాం. పంటల దిగుబడిలో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా నిలిచాడు. రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారింది. రాష్ట్రంలో వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకొనేందుకు దేవుడితోనైనా కొట్లాడుతా. -ముఖ్యమంత్రి కేసీఆర్