సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ – ఫిట్ తెలంగాణ రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. వ్యాయామం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుందని ఆయన చెప్పారు. నగరంలోని ఎల్‌బీ స్టేడియంలో శుక్రవారం ఫ్రీడమ్న్‌ల్రో పాల్గొన్న మంత్రి పచ్చజెండా ఊపి పరుగును ప్రారంభించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. అందరూ వ్యాయామాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకొని శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ‘సాట్స్ ఆధ్వర్యంలో ఆగస్టు 15 నుంచి ఫిట్ తెలంగాణ రన్ అన్ని జిల్లాల్లో విజయవంతంగా సాగుతున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం’ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అనంతరం ఆయన పరుగులో పాల్గొనడంతో పాటు పుషప్స్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, చాముండేశ్వరి నాథ్, ప్రణవి, క్రీడాశాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాస్ రాజు, సాట్స్ చైర్మన్ ఏ.వెంకటేశ్వర్ రెడ్డి, నిజామ్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీకాంత్ రాథో డ్, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.
