నర్సాపూర్‌ అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న హెటిరో డ్రగ్స్‌

హరితహారంలో భాగంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఎంపీ సంతోష్‌ పిలుపు మేరకు నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలోని 2543 ఎకరాలను హెటిరో డ్రగ్స్‌ పరిశ్రమ సోమవారం దత్తత తీసుకుంది. ఈ మేరకు అటవీ ప్రాంతం అభివృద్ధికి అయ్యే ఖర్చును సంస్థ భరించనుంది. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌తో కలిసి ఆ సంస్థ ఎండీ పార్థసారధిరెడ్డి నర్సాపూర్‌లో అడవిని సందర్శించారు.

ప్రకృతి మనకు ఎంతో ఇచ్చిందని, దానికి ఎంతోకొంత మనం తిరిగి ఇవ్వాలని సంస్థ ఎండీ బండి పార్థసారధి రెడ్డి అన్నారు. అందుకే అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు దత్తత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ప్రారంభించారు. రూ.5కోట్ల విలువైన చెక్కును మంత్రికి అందజేశారు. అనంతరం ఎంపీతో పాటు పార్థసారధి రెడ్డి మొక్కలు నాటారు.