కాలుష్య కోర‌ల్లో దేశ రాజ‌ధాని ఢిల్లీ

దేశ రాజ‌ధాని ఢిల్లీ కాలుష్య కోర‌ల్లో చిక్కుకున్న‌ది. వాహ‌నాలు, వివిధ ప‌రిశ్ర‌మ‌ల నుంచి వ‌చ్చే పొగ‌కు మంచు కూడా తోడ‌వ‌డంతో నగ‌రాన్ని వాయు కాలుష్యం క‌మ్మేసింది. దీంతో అధికారులు  అప్ర‌మ‌త్త‌మై చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఢిల్లీలో నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్న 39 ప్ర‌ధాన‌ ప్రాంతాల్లో యాంటీ స్మాగ్ గ‌న్స్ ఏర్పాటు చేసి కాలుష్యాన్ని త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఢిల్లీలో కాలుష్యాన్ని కంట్రోల్ చేయ‌డ‌మే త‌మ ప్ర‌ధాన ల‌క్ష్యమ‌ని, అందుకే ఇప్ప‌టికే మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసి అస‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఢిల్లీ ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి గోపాల్‌రాయ్ చెప్పారు. 

కాగా, ప్ర‌స్తుతం ఢిల్లీలో కాలుష్య తీవ్ర‌త అధికంగా ఉన్న‌ది. న‌గ‌రంలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్య‌త త‌గ్గిపోయింది. ఏయిర్ క్వాలిటీ సూచీ ఆనంద్ విహార్ ప్రాంతంలో 260గా, రోహిణిలో 238గా ఉన్న‌ది. బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల స‌మాయానికి ఢిల్లీలో అత్యంత కాలుష్య‌భ‌రిత‌మైన ప్రాంతాలు ఆనంద్ విహార్‌, రోహిణిలేన‌ని అక్క‌డి పొల్యూష‌న్ కంట్రోల్ క‌మిటీ తెలిపింది.