చెత్త బయట వేసిన వెంకటసాయి స్టీల్‌ ఇండస్ట్రీస్‌కు రూ.25వేలు జరిమానా

మేడ్చల్ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ.రెడ్డి ఆదేశాల మేరకు నర్సంపల్లిలో చెత్తను బయటవేసిన వెంకటసాయి స్టీల్‌ ఇండస్ట్రీస్‌కు రూ.25వేలు జరిమానా విధించామని కీసర ఎంపీవో మంగతాయారు తెలిపారు. పల్లె ప్రగతిలో భాగంగా చెత్తను బయట వేసిన దుకాణాదారులకు, కంపెనీలకు ఫైన్‌ విధించాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. దీంతో నర్సంపల్లిలో రూ.25వేలు, కీసరలోని బావార్చి హోటల్‌కు రూ.1500, ఎస్‌ఎల్‌బీ టైర్స్‌కు రూ.500, శ్రీ భవాని వైన్స్‌కు రూ.5వేలు, రాదేశం పాన్‌షాప్‌కు రూ.5వేలు, శ్రీకాంత్‌షాప్‌కు రూ.500, రెడ్డి షాప్‌కు రూ.500, శ్రీకనకదుర్గా వైన్స్‌కు రూ.వెయ్యి, దుర్గావైన్స్‌కు రూ.5వేల చొప్పున కీసరలోని షాప్‌ల యజమానులకు ఫైన్‌ విధించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో శశిరేఖ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి చెత్తను దుకాణాల ముందు, ఆరుబయట వేస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. సర్పంచ్‌ మాధురి వెంకటేశ్‌, ఎంపీటీసీ నారాయణశర్మ, ఉపసర్పంచ్‌ కందాడి బాలమణి, పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు.