దుబ్బాక ఉపఎన్నికకు నేడు నోటిఫికేష‌న్

ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి మ‌ర‌ణంతో త‌ప్ప‌నిస‌రైన దుబ్బాక ఉపఎన్నిక నోటిఫికేష‌న్ మ‌రికొద్దిసేట్లో విడుద‌ల కానుంది. దీంతో నామినేష‌న్ ప్ర‌క్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 16తో నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు గడువు ముగుస్తుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌ దాఖలుచేయవచ్చు. దుబ్బాక త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో రిట‌ర్నింగ్ అధికారి కార్యాల‌యం ఏర్పాటు చేశారు. 

క‌రోనా నేప‌థ్యంలో నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా నామినేషన్లు స్వీకరించనున్నారు. దీంతో నామినేష‌న్ దాఖ‌లుకు అభ్య‌ర్థి వెంట ఇద్ద‌రిని మాత్ర‌మే అనుమ‌తించ‌నున్నారు. అదేవిధంగా ఆన్‌లైన్‌లో కూడా నామినేష‌న్ వేసుకునే అవ‌కాశం క‌ల్పించారు. అయితే ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు అనంత‌రం నామినేష‌న్ పత్రాన్ని రిటర్నింగ్‌ అధికారికి నేరుగా అందజేయాల్సి ఉంటుంది. 

కాగా, రెండో శ‌నివారం, ఆదివారం సంద‌ర్భంగా 10, 11 తేదీల్లో నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. ఈనెల 17న నామినేష‌న్ల స్క్రూటినీ చేస్తారు. ఈనెల 19లోపు నామినేష‌న్లు ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. న‌వంబ‌ర్ 3న ఉపఎన్నిక పోలింగ్ జ‌రుగుతుంది. అదే నెల 10న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.