మల్కాజ్‌గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి అక్రమాస్తుల కేసు దర్యాప్తును ఏసీబీ అధికారులు వేగవంతం చేశారు. నర్సింహారెడ్డికి చెందిన 8 మంది బినామీలను కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లిలోని ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రేపట్నుంచి రెండు రోజుల పాటు 8 మంది బినామీలను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. నర్సింహారెడ్డి, ఆస్తులు, భూదందాలపై అధికారులు ఆరా తీయనున్నారు.
అక్టోబర్ 5 నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించిన విషయం విదితమే. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా ఏసీబీ అధికారులు అడిగిన ఏ ప్రశ్నకూ సరైన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. సోదాల్లో పట్టుబడిన, ఇతర దర్యాప్తులో సేకరించిన పత్రాలు, ఆధారాలను ముందుంచి ప్రశ్నించినా ఏసీపీ నుంచి ఆశించిన మేర సమాధానాలు రాలేదని సమాచారం. రూటు మార్చిన ఏసీబీ అధికారులు మరో పంథాలో కూపీ లాగుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే పట్టుబడిన ఆస్తుల్లో నర్సింహారెడ్డి బినామీలుగా గుర్తించిన వారిగురించి ఆరా తీస్తున్నారు.
మాదాపూర్ భూకొనుగోలులో నర్సింహారెడ్డి బినామీలు 8 మంది ఉన్నట్లు, మాదాపూర్‌కు చెందిన ఓ మహిళతో ఏసీపీకి సన్నిహిత సంబంధాలున్నట్టు, ఆమె పేరిట కూడా శంకర్‌పల్లితోపాటు పలుచోట్ల ఆస్తులను కొనుగోలుచేసినట్టు వెలుగులోకి వచ్చాయి. సదరు మహిళ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో తెలుసుకున్నారు. ఆమె స్వదేశానికి వస్తే మరిన్ని కీలక విషయాలు తెలిసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. మాదాపూర్‌లో ఇప్పటికే గుర్తించిన రూ.50 కోట్ల విలువైన స్థలంతోపాటు ఖరీదైన ఇంటిని నర్సింహారెడ్డి కొనుగోలుచేసినట్టు అధికారులు పత్రాలు సేకరించారు. వీటి ప్రకారం మాదాపూర్ మహిళ పేరిటే ఈ ఆస్తి సైతం ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.