ఏసీబీకి చిక్కిన బాన్సువాడ రూరల్‌ సీఐ టాటాబాబు

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన కామారెడ్డి జిల్లా బాన్సువాడ రూరల్‌ సీఐ టాటాబాబు. మెదక్‌ ఏసీబీ డీఎస్పీ రవికుమార్‌ కథనం ప్రకారం.. నస్రుల్లాబాద్‌కు చెందిన శివప్రసాద్‌, బాన్సువాడకు చెందిన ప్రతాప్‌ సింగ్‌ల మధ్య కాంట్రాక్టులకు సంబంధించిన తగాదాలు ఉన్నాయి. ఈ విషయమై నస్రుల్లాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆగస్టు 21న కేసు నమోదైంది. తనను అరెస్టు చేయకుండా ఉండటానికి బాన్సువాడకు చెందిన ఓ పార్టీ నాయకుడి ద్వారా ప్రతాప్‌సింగ్‌ రూరల్‌ సీఐ టాటాబాబును కలిశాడు. దీనికోసం రూ.50 వేలు డిమాండ్‌ చేసిన టాటాబాబు చివరకు రూ.20 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అక్టోబర్‌ 10న రూ.10 వేలు ఇవ్వగా మిగతా రూ. 10 వేలు సోమవారం బాన్సువాడలోని తన నివాసంలో సీఐ టాటాబాబు లంచం తీసుకోగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని సీఐని అదుపులోకి తీసుకున్నారు.