తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. జీహెచ్ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు.
బిల్లులకు ఇప్పటికే మంత్రి మండలి ఆమోద ముద్రవేసింది. భూముల ధర నిర్ధారణకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్లకు 47ఏ కింద ఉన్న విచక్షణాధికారాలను రద్దు చేస్తూ ఇండియన్ స్టాంప్ చట్టానికి సవరణను రాష్ట్ర ప్రభుత్వం సవరణ సీఎం కేసీఆర్ సభలో ప్రవేశపెట్టనున్నారు. వ్యవస్యాయ భూముల్ని వ్యవసాయేతరులుగా బదలాయించే ప్రక్రియలో అధికారులకు విచక్షణాధికారాలు లేకుండా ‘ధరణి’ ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేలా చట్ట సవరణను సీఎం ప్రవేశపెడుతారు. పలు కీలక సవరణకు ఉద్దేశించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్ట సవరణ బిల్లును పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సభలో ప్రవేశపెట్టనున్నారు.
ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం, పారదర్శకత, పని చేయని వారిపై వేటు, వార్డు కమిటీలు, పచ్చదనం పరిశుభ్రతకు ప్రాధాన్యం, రెండు ఎన్నికల్లో ఒకే రిజర్వేషన్లులాంటి అంశాలు బిల్లులో ఉండనున్నాయి. నిందితులకు పూచీకత్తుకు సంబంధించి హైకోర్టు సూచన మేరకు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ చట్ట సవరణ బిల్లును మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నాలుగు బిల్లులపై అసెంబ్లీలో ఇవాళ చర్చ జరుగనుంది. శాసన సభ ఆమోదం తర్వాత బిల్లులను బుధవారం మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.