ఉత్తరప్రదేశ్‌లో అక్రమ మైనింగ్‌పై న్యాయపోరాటం చేస్తున్న ఓ పూజారి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా తన గళాన్ని చురుకుగా వినిపిస్తున్న పూజారి అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు. పూజారి మృతదేహం మొరాదాబాద్‌లోని అసలాత్పుర ప్రాంతంలోని ఒక ఆలయంలో లభించింది. ఈ ప్రాంతం గల్‌షహీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేగానీ అతడి మరణానికి గల కారణాలు తెలుస్తాయని మొరాదాబాద్ పోలీసులు చెప్పారు. పూజారిని రామ్దాస్జీ మహారాజ్‌గా గుర్తించారు.
పూజారి రామ్దాస్జీ మహారాజ్ రామ్‌గంగా కాలుష్య నియంత్రణ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.
బరేలీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పూజారి తన గళం వినిపించారు. ఆందోళనలు జరిపారు. సేవ్ రామ్ గంగా మిషన్‌తో కలిసి పనిచేశారు. చివరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసి న్యాయపోరాటం చేస్తున్నారు. ఈయన దాఖలు చేసిన పిటిషన్ రాజస్థాన్ హైకోర్టులో విచారణలో ఉన్నది. అయితే, పూజారి సహజ మరణం చెందారని, అతడి శరీరంపై ఎటువంటి గాయం గుర్తులు లేవని తెలుస్తున్నది. పూజారి మరణం వెలుగులోకి వచ్చిన తరువాత అనేక మంది స్థానిక మహంతులు, పూజారులు ఈ ప్రాంతంలో గుమిగూడి మొరాదాబాద్-హరిద్వార్ రహదారిపై బైఠాయించారు. నిరసన సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని కోపంతో ఉన్న నిరసనకారులను శాంతింపజేశారు. పూజారి మరణానికి కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారని, పోస్టుమార్టం నివేదిక ఫలితం ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మొరాదాబాద్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ప్రభాకర్ చౌదరి ఆందోళనాకారులకు హామీ ఇచ్చారు.