తెలంగాణ‌కు ఢిల్లీ ప్ర‌భుత్వం రూ. 15 కోట్ల విరాళం

హైద‌రాబాద్ న‌గరాన్ని భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు ముంచెత్తిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌లు కాల‌నీలు జ‌ల‌దిగ్బంధంలో చిక్కుకున్నాయి. న‌గ‌ర ప్ర‌జ‌లు అత‌లాకుత‌ల‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా తెలంగాణ‌కు అండ‌గా నిలుస్తున్నాయి. ఇప్ప‌టికే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రూ. 10 కోట్లు విరాళం ప్ర‌క‌టించ‌గా.. తాజాగా ఢిల్లీ ప్ర‌భుత్వం ముందుకొచ్చింది. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రంలో సహాయ పునారావాస కార్యక్రమాల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తమ రాష్ట్రం తరుఫున రూ.15 కోట్ల సాయాన్ని ప్రకటించారు. కష్ట సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ పూర్తిగా అండగా ఉంటుందని వెల్లడించారు. రూ.15 కోట్ల సాయం ప్రకటించిన కేజ్రీవాల్ కు తెలంగాణ ప్రజల తరుఫున ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం కేజ్రీవాల్ కు కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. కేజ్రీవాల్ ఎంతో ఉదారత చాటుకుని అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు.