అమరుల కుటుంబాలకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్ సజ్జనార్‌ పరామర్శ

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ కొనియాడారు. శుక్రవారం ఆయన అధికారులతో కలిసి అమరవీరుల ఇంటికివెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఐపీఎస్‌ అధికారి చదలవాడ ఉమేశ్‌చంద్ర ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకొన్నారు. ఉమేశ్‌చంద్ర తల్లిదండ్రులను సత్కరించారు. దొంగనోట్ల ముఠాను పట్టుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్‌ కానిస్టేబుల్‌ ఈశ్వర్‌రావు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు పోలీస్‌శాఖ అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సీపీ వెంట శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.