ముఖ్యమంత్రి కేసీఆర్ జనగాం పర్యటన ఖరారైంది. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో శనివారం కేసీఆర్ పర్యటించనున్నారు. హెలీక్యాప్టర్ ద్వారా రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు కేసీఆర్ కొడకండ్ల చేరుకుంటారు. నిర్మాణం పూర్తయిన రైతు వేదికను ప్రారంభిస్తారు. ఆ తర్వాత పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించనున్నారు. అంతేకాకుండా స్థానిక వ్యవసాయ మార్కెట్ ఆవరణలో సుమారు 5 వేల మంది రైతులతో ఏర్పాటుచేసే సభలో కేసీఆర్ మాట్లాడతారు. ఈ సందర్భంగా రైతు వేదికల ముఖ్య ఉద్దేశాలను ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి హాజరయ్యే రైతు బంధు జిల్లా, మండల, గ్రామ కమిటీల సభ్యులతో పాటు రైతులకు, తద్వారా రాష్ట్రంలోని రైతాంగానికి సీఎం వివరించనున్నారు. ఈ పర్యటనలో సీఎం వెంట రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
