స్థలం విషయంలో జరిగిన వివాదానికి సంబంధించి కేసు పెట్టకుండా ఉండేందుకు రూ.లక్ష విలువైన సెల్ ఫోన్‌తోపాటు రూ.50 వేల నగదు డిమాండ్ చేసిన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ సీఐ పల్లె రాకేశ్ శనివారం ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ రవికుమార్ వివరాల ప్రకారం.. స్థల వివా దం నేపథ్యంలో కేసు పెట్టకుండా, వివాదం నాడు సీజ్‌చేసిన బైక్‌ను తిరిగిచ్చేందుకు పట్టణానికి చెందిన మహ్మద్ సాజిద్ అహ్మద్‌పై సీఐతోపాటు ఎస్సై మొగులయ్య, జీపు డ్రైవర్ గజేంద్ర లంచం కోసం ఒత్తిడి తెచ్చారు. సాజిద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శనివారం బాధితుడు రూ.1,03,999 విలువైన సెల్‌ఫోన్, రూ.50 వేలు సీఐకి ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసులో సీఐ, ఎస్సై, జీపు డ్రైవర్‌ను కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు డీఎస్పీ తెలిపారు.
