హ్యాండ్‌బాల్‌ జాతీయ అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌రావు

జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం (హెచ్‌ఎఫ్‌ఐ) ఎన్నికల్లో అరిశెనపల్లి జగన్‌మోహన్‌రావు విజయ దుందుభి మోగించారు. అధ్యక్ష పదవికి జగన్‌ ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆదివారం లక్నోలోని హెచ్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యాలయంలో జగన్‌మోహన్‌రావు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆనందీశ్వర్‌ పాండే, ప్రదీప్‌ కుమార్‌ బలంచు సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్లుగా ఎన్నికయ్యారు. రెండేండ్ల క్రితం నుంచి హ్యాండ్‌బాల్‌లో క్రియాశీలంగా పనిచేస్తున్న జగన్‌మోహన్‌రావు.. అంచెలంచెలుగా ఎదుగుతూ  జాతీయ క్రీడా సంఘానికి అధ్యక్షుడైన తొలి తెలంగాణ వ్యక్తిగా నిలిచారు. ‘ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర సంఘాలకు కృతజ్ఞతలు. హ్యాండ్‌బాల్‌ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తా. తొలుత మౌలిక వసతులపై దృష్టిపెట్టి.. అనంతరం నిష్ణాతులైన కోచ్‌ల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా టాలెంట్‌ హంట్‌ నిర్వహిస్తాం. మెరికల్లాంటి క్రీడాకారులను వెతికిపట్టి పారిస్‌ ఒలింపిక్స్‌ కల్లా పటిష్ట జట్టును సిద్ధం చేయడమే నా ధ్యేయం’అని జగన్‌మోహన్‌రావు అన్నారు.