తెలంగాణ రెవెన్యూశాఖలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ప్రజలకు పారదర్శకంగా, సులభంగా సేవలు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ధరణి వెబ్‌పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ల సేవలను శంషాబాద్ తాసిల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం ఉదయం లాంచనంగా ప్రారంభించారు. ధరణి సేవల ప్రక్రియను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు. గత నెల 29న సీఎం కేసీఆర్ పోర్టల్‌ను ప్రారంభించగా.. ప్రస్తుతం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు మాత్రమే జరుగనున్నాయి.
ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లా మినహా 570 మండలాల్లో రైతులకు ధరణి సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఇప్పటివరకు 1.48 లక్షల ఎకరాలకు సంబంధించి 59.46 లక్షల ఖాతాలు ధరణిలో నిక్షిప్తం అయ్యాయని స్పష్టం చేశారు. ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇవాళ 946 మంది రిజిస్ర్టేషన్ల కోసం నగదు చెల్లించారు. 888 మంది స్లాట్ బుక్ చేసుకున్నారని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.