తెలంగాణవ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగాలనే సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు వికారాబాద్ జిల్లాలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రి చాంబర్లో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలెయాదయ్య, ఆనంద్, నరేందర్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, టీఎస్ఐఐసీ ఎండి నర్సింహారెడ్డి, కలెక్టర్ పౌసుమిబసుతో కలిసి మంత్రి సబితాఇంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ నూతన పరిశ్రమలు, సంస్థలు రావటంతో అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధితో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. జిల్లాలోని పలు నియోజక వర్గా ల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో పరిశ్రమల స్థాపనకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, ఆ దిశగా భూములు గుర్తించి టీఎస్ఐఐసీకి అప్పజెప్పాలన్నారు. వ్యవసాయ భూము లు కా కుండా ప్రభుత్వ, ఖాళీగా ఉన్న అసైన్డ్ భూ ములు గుర్తించాలన్నారు. జాతీయ రహదారులు, రైల్వే రోడ్డు మార్గాలు ఉన్న ప్రాంతాలపై చాలా సంస్థలు ఆసక్తి చూపుతాయని, ఇతర ప్రాంతాల్లో కూడా టీఎస్ఐఐసీ మౌలిక వనరులు కల్పిస్తుందన్నారు. జిల్లాలోని నవాబుపేట మండంలలోని ఆర్కతల, చించల్‌పేట, వికారాబాద్ మండల పరిధిలోని కొత్ప్రల్లి, మర్పల్లి మండలం ఘనాపూర్, మోమిన్‌పేట మండలం ఎన్కతల, తాండూరు నియోజక వర్గంలోని నవాల్గ, పరిగి నియోజక వర్గంలోని రాకంచెర్లలో పారిశ్రామికవాడల కోసం భూములను టీఎస్ఐఐసీ, రెవెన్యూ అధికారులు సందర్శించి ఎంపిక చేయాలన్నారు. దీంతోపాటు కొడంగల్ పరిగి నియోజక వర్గాల మధ్య జాతీయ రహదారి పక్కన కూడా పరిశ్రమల స్థాపన కోసం అనువైన స్థలం గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. నూతనంగా ఏర్పాటు అయ్యే పరిశ్రమలు, సంస్థలలో స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తే రాయితీలు ఇస్తామని ఇప్పటికే మంత్రి కేటీఆర్ ప్రకటించారని మంత్రి అన్నారు. సమావేశంలో రెవెన్యూ, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.
