ఏపీలో 262 మంది విద్యార్థులు, 160 మంది టీచర్స్‌కు కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు తెరిచిన తర్వాత 262 మంది విద్యార్థులు, 160 మంది ఉపాధ్యాయులకు కరోనా సోకింది. ఈ నెల 2వ తేదీ నుంచి ఏపీలో 9,10 తరగతుల ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లు, ఇంటర్‌ కాలేజీలను పునరుద్ధరించారు. రోజు మార్చి రోజు ఒక పూట తరగతులను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ గణంకాల ప్రకారం మొత్తం 9.75 లక్షల 9, 10వ తరగతి విద్యార్థుల్లో 3.93 లక్షల మంది బుధవారం స్కూళ్లకు హాజరయ్యారు. అలాగే 1.11 లక్షల టీచర్లలో 99 వేలకుపైగా స్కూళ్లకు వచ్చారు. బుధవారం వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా 262 మంది విద్యార్థులు, 160 మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే పరిస్థితి ఏమంత ప్రమాదకరంగా లేదని ప్రభుత్వం తెలిపింది. విద్యా సంస్థల్లో కరోనా సెఫ్టీ ప్రోటోకాల్స్‌ను మరింత కచ్చితంగా అమలు చేసేలా చర్యలు చేపడతామని విద్యాశాఖ కమిషనర్‌ వి చిన్న వీరభద్రుడు తెలిపారు.