దీపావళి పండుగ నేపథ్యంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్‌పీసీబీ) అధికారులు అప్రమత్తమయ్యారు. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు చర్యలకు ఉపక్రమించారు. దీంట్లో భాగంగా ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు సమాయత్తమవుతున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ పీసీబీ అధికారులు గ్రేటర్ హైదరాబాద్ లో దీపావళి కాలుష్యాన్ని నమోదు చేయబోతున్నారు. శబ్ద కాలుష్యంతో పాటు, వాయు కాలుష్యాన్ని సైతం లెక్కించనున్నారు. ఇందుకోసం తెలంగాణ పీసీబీ అధికారులు ప్రత్యేకంగా షెడ్యూల్‌ను రూపొందించుకున్నారు. పండుగకు ముందు, పండుగ రోజులతో పాటు, పండుగ తర్వాత ఇలా మూడు సార్లు కాలుష్య తీవ్రతలను నమోదుచేయబోతున్నారు. వీటితో పాటు పర్యావరణహిత దీపావళినే జరుపుకుందామని అవగాహన కల్పిస్తూ పీసీబీ అధికారులు పలు అవగాహన కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. కాంతులు వెదజల్లే పటాకులను కాల్చాలని కోరుతూ.. పోస్టర్లు, టీవీలు, రేడియోల ద్వారా ప్రచారం చేయడంతో పాటు ప్రసార, ప్రచార సాధనాల ద్వారా అవగాహన కల్పించనున్నారు.
