జీడిమెట్లలో నిర్మించిన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంటును శనివారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. రోజుకు 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఈ ప్లాంటును జీడిమెట్ల పారిశ్రామికవాడ ఫేజ్-6లోని 15 ఎకరాల విస్తీర్ణంలో జీహెచ్‌ఎంసీ, రాంకీ ఎన్విరో సంస్థ సంయుక్తాధ్వర్యంలో ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ స్థలాన్ని సమకూర్చగా, రాంకీ సంస్థ ప్లాంటును నెలకొల్పింది. నగరంలో ఇండ్లు కూల్చడం, మరమ్మతులు, రోడ్డు తవ్వకాల ద్వారా వచ్చే వ్యర్థాలను నిర్ణీత ఫీజు వసూలు చేసి ఇక్కడికి తరలించనున్నారు. ఇక్కడ ఆ వ్యర్థాల్లోని కంకర, మట్టి, ఇసుక తదితర వాటిని వేరు చేసి పేవ్‌మెంట్ టైల్స్, ఇటుకలు తయారు చేయనున్నారు. జవహర్‌నగర్, జీడిమెట్ల, ఫతుల్లాగూడ, కొత్వాల్‌గూడ, సచివాలయం తదితర చోట్లనుంచి ఇప్పటివరకు 13,14,791.11 మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలను ప్లాంటుకు తరలించినట్లు రాంకీ వర్గాలు తెలిపాయి.
ప్లాంట్ పరిశీలన..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పారిశ్రామిక వాడ ఫేజ్-6లో నిర్మించిన సీ అండ్ డీ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులు కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మమతతో కలిసి పర్యటించారు. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ వ్యర్థాలను తిరిగి వినియోగించేలా ఈ ప్లాంట్ పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో సూరారం డివిజన్ కార్పొరేటర మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు.