తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021 సెలవుల క్యాలెండర్‌ విడుదల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి సంబంధించి సెలవులను ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సెలవుల క్యాలెండర్‌ను విడుదలచేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 2021లో 28 సాధారణ సెలవులు,  25 ఐచ్ఛిక సెలవులు ఉంటాయని తెలిపారు. కొత్త సంవత్సరం ప్రారంభ దినమైన జనవరి ఒకటో తేదీని సాధారణ సెలవుగా ప్రకటించిన సర్కారు, 2021 ఫిబ్రవరి13వ తేదీ రెండో  శనివారాన్ని పనిదినంగా నిర్ణయించింది.  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులతో పాటు 2021లో ఐదుకు మించకుండా ఐచ్ఛిక సెలవులు వినియోగించుకోవచ్చని సీఎస్‌ ఆ  ఉత్తర్వులో స్పష్టం చేశారు. సాధారణ సెలవులు పరిశ్రమలకు వర్తించవని ప్రభుత్వం తెలిపింది. పబ్లిక్‌ వర్క్స్‌ విభాగాలు, విద్యాసంస్థలు.. సెలవులకు సంబంధించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తాయని జీవోలో స్పష్టం చేశారు. ఈదుల్‌ ఫితర్‌ (రంజాన్‌) ఈదుల్‌ అఝా (బక్రీద్‌), మొహర్రం, మిలాద్‌ ఉన్‌ నబి  పండుగలకు  సంబంధించి ఏదైనా మార్పులుంటే ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌మీడియా ద్వారా ప్రకటిస్తామని ఉత్తర్వుల్లో తెలిపారు.