ఇందిరా పార్కులో ‘గంధం చెట్ల’ దొంగలు

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్కులో గుర్తు తెలియని వ్యక్తులు గంధపుచెట్లను నరికేశారు. వాటన్నింటిని పార్కు నుంచి తరలించారు. చెట్లను నరికి విక్రయించుకున్న వ్యక్తులు ఇంటి దొంగలే అయి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గంధపు చెట్ల నరికివేతకు నిరసనగా ఇందిరా పార్కు వద్ద మార్నింగ్ వాకర్స్ ఆందోళనకు దిగారు. ఇందిరా పార్కును కాపాడుకుందామంటూ  నినాదాలు చేశారు. గంధపుచెట్లను నరికివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందిరా పార్కులో దాదాపు 13 గంధపు చెట్లను నరికి ఎత్తుకుపోయారు.

అర్ధరాత్రిపూట కొంతమంది స్మగ్లర్లు గంధపు చెట్లను రంపంతో కోసుకుని లారీల్లో గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తున్నారు. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ హర్టికల్చర్ అధికారులు గాందీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు రోజులుగా ఇందిరాపార్క్‌ సెక్యూరిటీ సిబ్బంది, సమీపంలో నివాసితులను విచారిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ అధికారులు నిద్రమత్తును వీడకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

రెండ్రోజుల కిత్రం..  

  • గత ఆదివారం అర్ధరాత్రి కొందరు దుండగులు పార్క్‌లోకి చొరబడ్డారు. సుమారు 11 గంధపు చెట్లను రంపాలతో కోసి కొమ్మలను అక్కడే పడేసి దుంగలను మాత్రం లోయర్‌ట్యాంక్‌బండ్‌ వైపుగా తరలించారు.  
  • విషయం తెలుసుకున్న అధికారులు ఉదయం 4 గంటలకు ఇందిరాపార్క్‌కు వచ్చే వాకర్స్‌ కంటపడకుండా కొమ్మలను సైతం తీసివేసినట్లు తెలిసింది. అనంతరం గాందీనగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకొన్నారు.  
  • రంగంలోకి దిగిన పోలీసులు పార్క్‌ సెక్యూరిటీని, అధికారులతో పాటు సమీపంలో నివసించే వారిని సైతం గుట్టుచప్పుడు కాకుండా విచారిస్తున్నారు.  
  • దీనిపై చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్‌ను వివరణ కోరగా.. రెండు స్పెషల్‌ టీంలను ఏర్పాటు చేశామన్నారు. విచారణ వేగవంతంగా జరుగుతోందన్నారు. ఈ స్మగ్లింగ్‌కి పాల్పడింది బయట వ్యక్తులేనని, ఇందిరాపార్క్‌ సిబ్బంది సహకారం ఉందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నామన్నారు.