తెలంగాణలో బాణాసంచా అమ్మకాలు, కాల్చడంపై హైకోర్టు గురువారం నిషేధం విధించింది. కరోనా నేపథ్యంలో దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చడాన్ని బ్యాన్ చేసింది. దీపావళి సందర్భంగా బాణాసంచాను నిషేధించాలని న్యాయవాది ఇంద్ర ప్రకాశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కరోనా పరిస్థితుల్లో కాలుష్యం పెరిగి తీవ్ర ప్రభావం చూపుతుందని పిటిషన్ పేర్కొన్నారు. సుప్రీం కోర్టు, పలు హైకోర్టులు రాష్ట్రాలు నిషేధం విధించాయని కోర్టుకు తెలిపారు. అయితే బాణాసంచాపై నిర్ధిష్ట పాలసీ రూపొందించలేదని, ఎన్టీసీ మార్గదర్శకాలు పాటిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు బాణాసంచాపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధంపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇలాగే ఇప్పటి వరకు తెరిచిన దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రాకర్స్ బ్యాన్ చేయడం ఉత్తమమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇప్పటి వరకు తెరచిన షాపులను మూసి వేయాలని ఆదేశించింది. ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని హెచ్చరించింది. ప్రచార మాధ్యమాల ద్వారా క్రాకర్స్ కాల్చకుండా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు టపాసులను నిషేధించిన విషయాన్ని న్యాయస్థానం ఈ సందర్భంగా గుర్తుచేసింది. క్రాకర్స్‌ను బ్యాన్ చేయాలంటూ రాజస్తాన్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది. ఇక కోల్‌కత్తాలో టపాసులు బ్యాన్‌చేయకపోతే తామే స్వయంగా రంగంలోకి దిగి నిషేదిస్తామని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు న్యాయస్థానం గుర్తుచేసింది.
దీపావళి నేపథ్యంలో గాలి నాణ్యత మరింత క్షీణించకుండా ఉండటానికి ఇదివరకే పలు రాష్ట్రాలు టపాసులపై నిషేధం విధిస్తున్న విషయ తెలిసిందే. దేశ రాజధానితో పాటు కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే క్రాకర్స్ బ్యాన్ చేశారు. నిషేధాన్ని ఉల్లంఘించిన వ్యక్తులను గుర్తించేందుకు పశ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్రణ మండలి (డబ్ల్యూబీపీసీబీ) రాష్ట్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్లకు వెయ్యి వరకు జీపీఎస్ అమర్చిన సౌండ్ మానిటరింగ్ పరికరాలను పంపిణీ చేసింది.