‘డీఎఫ్‌వో’ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి

అటవీ శాఖను మరింత బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లా అటవీ శాఖ (డీఎఫ్ వో) కార్యాలయాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలు, ఆదేశాల మేరకు అటవీ శాఖ  ఆకు పచ్చ తెలంగాణ దిశగా కృషి చేస్తుందన్నారు.

అడవులు, అటవీ భూముల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు, కొత్తగా పచ్చదనాన్ని పెంచుకోవాలనే దిశగా అధికారులు నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. నగర, పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉండే అటవీ ప్రాంతాలకు రక్షిత చర్యలు చేపట్టడంతో పాటు నగర, పట్టణ వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అర్బన్ ఫారెస్ట్ పార్కులు, స్నేక్ రెస్క్యూ సెంటర్లకు కొత్తగా ఏర్పడ్డ మేడ్చల్ జిల్లా ప్రసిద్ధి గాంచిందని పేర్కొన్నారు.

కొవిడ్ లాంటి ప్రత్యేక ప‌రిస్థితులు ఉన్నప్పటికి ఆరు నెలల్లోనే  భ‌వ‌న నిర్మాణం పూర్తి అయ్యేలా కృషి చేసిన అట‌వీ శాఖ అధికారుల‌కు అభినంద‌న‌లు తెలిపారు. రూ.20 ల‌క్షల వ్యయంతో ఇదే ప్రాంగణంలో నిర్మించనున్న డీఆర్వో క్వారర్టర్స్‌  నిర్మాణానికి మంత్రులు భూమి పూజ చేశారు. అనంతరం మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిదులు అటవీ శాఖ కార్యాలయ ప్రాంగణంలో  రెడ్ శాండల్, రోజ్ వుడ్, టేక్, శాండల్ వుడ్ మొక్కలు నాటారు.

 కార్యక్రమంలో అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతి కుమారి,  పీసీసీఎఫ్ ఆర్. శోభ, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, పీసీసీఎఫ్‌లు స్వర్గం శ్రీనివాస్, డొబ్రియల్, లోకేష్ జైస్వాల్, అడిషనల్ పీసీసీఎఫ్ చంద్రశేఖర్ రెడ్డి,డీఎఫ్‌వోలు సుధాకర్ రెడ్డి, భీమా నాయక్, డీవీ రెడ్డి, జోజీ, అశోక్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్  శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.