తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన అటవీ శాతం – అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో అడవుల శాతం క్రమంగా పెరుగుతున్నదని, సీఎం కేసీఆర్‌ అటవీ శాఖను బలోపేతం చేస్తున్నారని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. పోలీసు, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయడంతో కలప అక్రమ రవాణా 99శాతం తగ్గిందని వివరించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు కండ్లకోయ జంక్షన్‌ సమీపంలో 3 ఎకరాల విస్తీర్ణంలో రూ.65లక్షలతో నిర్మించిన మేడ్చల్‌ జిల్లా అటవీ శాఖ కార్యాలయాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం రూ.25 లక్షల వ్యయంతో నిర్మించే అటవీ శాఖ అధికారుల నివాస గృహ సముదాయానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ర్టాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తున్నామన్నారు. అర్బన్‌ లంగ్స్‌ పార్కుల అభివృద్ధి, స్నేక్‌ రెస్క్యూ సెంటర్ల ఏర్పాటుతో మేడ్చల్‌ జిల్లా ఎంతో ప్రసిద్ధిగాంచిందన్నారు. హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్‌ శోభ, కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, పీసీసీఎఫ్‌లు శ్రీనివాస్‌, డోబ్రియల్‌, లోకేశ్‌ జైస్వాల్‌, అడిషనల్‌ పీసీసీఎఫ్‌ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎఫ్‌వోలు సుధాకర్‌రెడ్డి, భీమానాయక్‌, డీవీరెడ్డి, జోజీ, అశోక్‌కుమార్‌, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ మద్దుల లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి, డీఈవో విజయకుమారి, జడ్పీ సీఈవో దేవసహాయం పాల్గొన్నారు.