
కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం శివారులో ఉన్నటువంటి మెస్సర్స్ పోరస్ ల్యాబోరేటరీస్ పరిశ్రమను రూ.25 కోట్లతో విస్తరించేందుకు యాజమాన్యం సంబంధిత, అధికారులకు, ఆయా శాఖలకు దరఖాస్తు చేసుకుంది. దీనిపై బుధవారం పరిశ్రమ దగ్గర ఉన్న సాయి మందిరంలో కలెక్టర్ అమయ్ కుమార్ సమక్షంలో పరిసర గ్రామాలైన నల్లబండగూడెం, చిమిర్యాల, మంగలితండా, రెడ్డకుంట గ్రామస్తులతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలకు, మా గ్రామాలకు ఎలాంటి సమస్యలు జల, వాయు కాలుష్యం లేకుండా పరిశ్రమను విస్తరించుకుంటే మాకు అభ్యంతరం లేదని చూట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు తెలిపారు. గ్రామాభివృద్ధికి, కొద్ది మందికి ఉద్యోగాలు ఇస్తూ పోరస్ వారు సహకరిస్తున్నారని కొందరు తెలిపారు.
పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మెడికల్ క్యాంపులు, గ్రామంలో మొక్కల పెంపకం చేపట్టాలని స్థానికులు కోరారు. నల్లబండగూడెంకు చెందిన కొంత మంది మాట్లాడుతూ.. ఇది వరకే ఉన్న పరిశ్రమలో భూగర్భజలాలు కలుషితమయ్యాయన్నారు. అలాగే పరిశ్రమలో స్థానికులకు కాకుండా పక్కన ఉన్న ఏపీ, ఇతర రాష్ట్రాల, జిల్లాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారని అలా కాకుండా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. వీటిపై కలెక్టర్, పరిశ్రమ యాజమాన్యం సమాధానం చెప్పాలని కోరగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోరస్ పరిశ్రమను నడుపుతామని, అర్హతలను బట్టి స్థానికులకు తప్పకుండా ఉద్యోగాలు ఇస్తామని పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ దిలీప్ కుమార్, జనరల్ మేనేజర్ కె. మాల కొండయ్యలు తెలిపారు.సమావేశంలో 34 మంది అభిప్రాయాలు తీసుకున్నామని మరో 22 మంది ఇక్కడ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారని వీటన్నింటిని ఉన్నతాధికారులకు పంపనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఎల్.కిశోర్ కుమార్, డీఎస్పీ రఘు, తహశీల్దార్ మహ్మాద్ అలీ, అయా గ్రామాల సర్పంచ్ లు సుశీల, కొండ శైలజ, రమావత్ పద్మ, లీలా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, ఎన్జీఓ నాయకులు పాల్గొన్నారు.