దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైన విభాగంలోనే కొనసాగుతోందని సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (సఫర్) తెలిపింది. ఆదివారం తేలికపాటి జల్లులు కురిసినా.. గాలి నాణ్యత సూచీ 490గా నమోదైందని పేర్కొంది. ఏక్యూఐ 51-100 మధ్య సంతృప్తికరంగా, 101-200 మితంగా, 201-300 మధ్య పేలవమైన, 301-400 చాలా పేలవమైన, 401-500 తీవ్రమైన కాలుష్యంగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కాలుష్యంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇప్పటికే వ్యాధులతో బాధపడుతున్న వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు. సోమవారం నుంచి 3-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గవచ్చని భారత వాతావరణశాఖ (ఐఎండీ) శాస్త్రవేత్త ఆర్కే జెనమణి తెలిపారు.
ఇదిలా ఉండగా.. స్థానికులు మాట్లాడుతూ రోజు ఉదయం సైక్లింగ్ కోసం బయటకు వెళ్తానని.. గొంతులో దురద, కళ్ల నుంచి నీరు కారడం వంటి సమస్యలు ఎర్కొంటున్నామని చెప్పారు. నిన్న కురిసిన వర్షంతో కొంత ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. మహమ్మారి నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నవంబర్ 9 నుంచి 30వ తేదీ వరకు పటాకులపై నిషేధం విధించింది. అయినా పలు చోట్ల ప్రజలు పటాకులు కాల్చడంతో కాలుష్యం భారీగా పెరిగింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం.. వచ్చే రెండు గంటల్లో డియోబంద్, సహారాన్పూర్, యమునానగర్, రూర్కీ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తుందని చెప్పారు.