జీహెచ్‌ఎంసీ ఎన్నికల మార్గదర్శకాలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)కి ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. కొవిడ్‌ దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను వివరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. పోలింగ్‌ కేంద్రానికి విచ్చేసేవారు శానిటైజ్‌ చేసుకోవడంతో పాటు, ఫేస్‌ మాస్క్‌ ధరించడం, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలంది. వీటితో పాటు ఇతర మార్గదర్శకాలు ఈ విధంగా ఉన్నాయి.  

– నామినేషన్‌ సమయంలో అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతిన వాహనాల సంఖ్య రెండుకు పరిమితం

– భద్రతా సిబ్బంది మినహా ఐదుగురి సభ్యుల బృందానికి మాత్రమే ఇంటింటి ప్రచారానికి అనుమతి 

– ప్రచార కాన్వాయ్‌లో రెండు వాహనాల మధ్య కనీసం 100 మీటర్ల దూరం ఉండాలి 

– పార్టీల అభ్యర్థుల రోడ్‌ షోలకు మధ్య కనీసం అర్థగంట విరామం తప్పనిసరి

– కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు. జీహెచ్‌ఎంసీ, సర్కిల్‌, వార్డుల వారీగా నోడల్‌ హెల్త్‌ అధికారుల నియామకం

– ఎన్నికల సిబ్బందికి పెద్ద హాల్స్‌లో శిక్షణ. వర్చువల్‌ ట్రైనింగ్‌ను ఉపయోగించుకోవచ్చు

– సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వారికి బదులుగా మరొకరిని వినియోగించుకునేందుకు రిటర్నింగ్‌ అధికారులు, కమిషనర్‌, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలి

– దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వారు, నోటిఫైడ్‌ అత్యవసర సేవల్లో ఉన్నవారు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవచ్చు

– ఒక కౌంటింగ్‌ హాల్‌లో 10 కౌంటింగ్‌ టేబుళ్లకు మించి ఉండకూడదు.