జాతీయ స్థాయిలో అనేక అంశాల్లో ప్రత్యేకత చాటుతూ అనేక అవార్డులు చేజిక్కించుకున్న సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలు మరో అవార్డును సొంతం చేసుకున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్‌లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు మెరుగ్గా అమలు చేస్తున్నందుకు ఈ రెండు జిల్లాలకు మరో జాతీయ అవార్డు లభించింది. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ‘స్వచ్ఛ్‌భారత్ మిషన్ గ్రామీణ్’లో అద్భుత ప్రగతి కనబర్చిన దేశంలోని 20 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా అందులో తెలంగాణ నుంచి సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలు చోటుదక్కించుకున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని గురువారం ఢిల్లీ నుంచి వర్చువల్ ద్వారా నిర్వహించగా, కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నుంచి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, పెద్దపల్లి ఇంచార్జి కలెక్టర్ భారతి హోళికేరి స్వీకరించారు. సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాల్లో చేపట్టిన స్వచ్ఛత కార్యక్రమాలకు దేశవ్యాప్త గుర్తింపు రావడం సంతోషంగా ఉన్నదని కలెక్టర్లు తెలిపారు. పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగంలో ముం దుండటం వల్లే ఈ అవార్డు లభించినట్లు వారు పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్ఠి పనితీరే ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణమన్నారు.
