ఇవాళ తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 1.23 గంటలకు బృహస్పతి మకరరాశిలోకి ప్రవేశించిన వెంటనే పుష్కరాలను శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను దేవాదాయ శాఖ ఇప్పటికే పూర్తిచేసింది. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ సంప్రదాయబద్ధంగా పుష్కరాలకు అంకురార్పణ చేయనున్నారు. శ్రీమాధవానందస్వామి, శ్రీకమలానందభారత స్వామిజీ చేతుల మీదుగా పుష్కరాలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్‌రెండ్డి, ఇంద్రకర్‌రెడ్డి పాల్గొంటారు.
పుష్కరాల్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్, రాజోలి, పుల్లూరు, వేణిసోంపూర్‌లో పుష్కర ఘాట్లు ఏర్పాటుచేశారు. పిండ ప్రదానాలు, ప్రత్యేక పూజలకు మాత్రమే అనుమతించనున్నారు. కొవిడ్ నెగెటివ్ రిపోర్టు చూపించిన భక్తులను మాత్రమే ఘాట్లలోకి అనుమతిస్తారు. రిపోర్టు లేనివారికి పుష్కర ఘాట్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నవారినే ఘాట్లలోకి పంపిస్తారు. ఆలయాల్లో భౌతికదూరం పాటించేలా అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్కరాలు నిర్వహిస్తారు.
పుష్కరాలకోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ రీజియన్‌లో మూడు డిపోల నుంచి 20 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. గద్వాల డిపో నుంచి రాజోలిఘాట్ వరకు 10 ప్రత్యేక బస్సులు, మహబూబ్‌నగర్, వనపర్తి డిపోల నుంచి 10 ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. పుల్లూరు, అలంపూర్ ఘాట్లకు ఐదు చొప్పున బస్సులను ఏర్పాటు చేసింది.