జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర సమితి దూసుకుపోతున్నది. అన్నీ తానై సాగుతున్న ప్రచారసారథి మంత్రి కేటీఆర్‌కు అడుగడుగునా జనాలు నీరాజనం పలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఇవాళ మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల పరిధిలో రోడ్డు షో నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మహేశ్వరం పరిధిలోని సరూర్‌నగర్, ఆర్కే పురం డివిజన్లకు సంబంధించి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ నగర్లో ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఎల్బీనగర్ పరిధిలోని మన్సూరాబాద్ బిగ్‌బజార్ చౌరస్తాలో నాగోల్, కొత్తపేట, మన్సూరాబాద్ డివిజన్ల ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడతారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు వనస్థలిపురం రైతుబజార్ చౌరస్తాలో బీఎన్‌రెడ్డినగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌కు సంబంధించి.. సాయంత్రం 7 గంటలకు కర్మన్‌ఘాట్ ఇంద్రనాగేంద్ర టాకీస్ చౌరస్తాలో చంపాపేట్, లింగోజీగూడ, గడ్డిఅన్నారం, హస్తినాపురం, చైతన్యపురి డివిజన్ల ప్రజలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు.
