నివర్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ పర్యటనకు బయలుదేరారు. శనివారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరిన ఏపీ సీఎం జగన్ గన్నవరం విమానశ్రయం నుంచి నేరుగా చిత్తూరు జిల్లాకు వెళ్లనున్నారు. అక్కడ నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం సీఎం తాడేపల్లికి తిరుగుపయనమవుతారు. కాగా, తుపాను ప్రభావంతో శుక్రవారం కూడా రాష్ట్రంలో పలు జిల్లాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి.
